కలం, వెబ్ డెస్క్ : మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టును బీఆర్ ఎస్, బీజేపీ అడ్డుకోవద్దని.. సలహాలు ఇస్తే తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి (Revanth) చెప్పారు. తాజ్ కృష్ణ హోటల్ లో మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి (Revanth) మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎక్కడైనా నదీ పరివాహక ప్రాంతంలోనే నాగరికత విలసిల్లిందని చెప్పారు. ‘మన దేశంలో కూడా నాగరికత మొత్తం నదుల చుట్టూనే ఉంది. కానీ మూసీ నదిని మాత్రం నిర్వీర్యం చేశారు. నేను సింగపూర్, దుబాయ్, లండన్, సియోల్ ప్రాంతాల్లో పర్యటించి అక్కడి నదులను పరిశీలించాను. అక్కడ నదులు పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చేశారు. మూసీ కూడా అలా అభివృద్ధి కావాల్సి ఉంది. అందుకే మా ప్రభుత్వం అందుకు చర్యలు తీసుకుంటోంది’ అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
హైదరాబాద్ లో చార్మినార్ నుంచి మొదలు పెడితే.. ఓయూ, ఉస్మానియా హాస్పిటల్, సాలార్జింగ్ మ్యూజియం ఇలా ఎన్నో హిస్టారికల్ కట్టడాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయని.. మూసీ మాత్రం ఆ స్థాయిలో విరజిల్లట్లేదని సీఎం రేవంత్ తెలిపారు. ‘ఎవరో ఒకరు పునాది వేసి నిర్మిస్తే అవి భవిష్యత్ తరాలకు ఉపయోగకరంగా ఉంటాయి. ఏ దేశంలో అయినా నదీ పరివాహక ప్రాంతాలే అభివృద్ధి చెందుతాయి. ప్రపంచ దేశాలు ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. తెలంగాణ కూడా ఆ విధంగా అభివృద్ధి చెందొద్దా. పదేళ్లుగా కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ ఎస్ ఉన్నా సరే మూసీని అభివృద్ధి చేయలేదు. వాళ్లు ఇప్పుడు మేం చేస్తామంటే అడ్డుకుంటున్నారు. వాళ్లు ఎందుకు సలహాలు ఇవ్వట్లేదు. వాళ్లు సలహాలు ఇస్తే మేం తీసుకుంటాం’ అని సీఎం చెప్పుకొచ్చారు.

