కలం, నల్లగొండ బ్యూరో : ఒకవైపు ఆకాశాన్నంటుతున్న ధరలు.. మరోవైపు అడుగడుగునా అక్రమ దందాలు.. సామాన్యుడి వంటింట్లో మంట పుట్టించాల్సిన గ్యాస్.. నేడు కన్నీళ్లు తెప్పిస్తోంది. గ్యాస్ బుక్ చేసి వారం దాటినా సిలిండర్ ఇంటికి రాదు కానీ, అదే ఏజెన్సీ నుంచి అడ్డదారిలో హోటళ్లకు మాత్రం కుప్పలు తెప్పలుగా చేరుతున్నాయి. దీంతో నల్లగొండ (Nalgonda) జిల్లాలో సామాన్యుడి పరిస్థితి పొయ్యి వెలగదు.. ఆకలి తీరదు అన్నట్లుగా తయారయింది. ఫలితంగా వంట గ్యాస్ సిలిండర్ కోసం వినియోగదారులు అరిగోస పడుతున్నారు. సాక్షాత్తూ జిల్లా కలెక్టర్ మాత్రం గ్యాస్ సరఫరాకు ఏ ఇబ్బందీ లేదని చెబుతుండడం గమనార్హం. ఇదిలావుంటే.. గ్యాస్ కొరతపై జరుగుతున్న ప్రచారంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. మరో రెండు నెలల పాటు ఇదే పరిస్థితి ఉంటుందనే ప్రచారం జోరందుకోవడంతో ఒక రకమైన భయం నెలకొంది. భవిష్యత్తులో గ్యాస్ ధరలు ఇంకా పెరుగుతాయని, సరఫరా పూర్తిగా నిలిచిపోతుందనే ప్రచారంతో అవసరం లేకున్నా సిలిండర్‌లను నిల్వ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని సరఫరాను క్రమబద్ధీకరించకపోతే.. సామాన్యులు మరింతగా ఇబ్బందులు పడే ప్రమాదం లేకపోలేదు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇదీ పరిస్థితి..
ఉమ్మడి నల్లగొండ (Nalgonda) జిల్లా వ్యాప్తంగా దాదాపు 14 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. కాగా, ఇందులో మరో 45వేల వరకు కమర్షియల్ కనెక్షన్లు ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో దాదాపు 5.5 లక్షల కనెక్షన్లు ఉండగా, సూర్యాపేటలో 4.06 లక్షల కనెక్షన్లు, యాదాద్రి భువనగిరిలో దాదాపు 3.5 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. ఇక గ్యాస్ సరఫరా కోసం దాదాపు 110 ఏజెన్సీల వరకు ఉన్నాయి. అయితే ఉమ్మడి జిల్లాలో రోజుకు సగటున 30వేల సిలిండర్లు డెలివరీ అవుతుంటాయి. సగటున ఒక్కో కుటుంబం 2 నెలలకు ఒక సిలిండర్‌ను వినియోగిస్తుంటుంది.
పనిచేయని బుకింగ్స్.. అందని సిలిండర్లు..
గ్యాస్ బుక్ చేసుకుంటే 24 గంటల్లో ఇంటికి రావాల్సిన సిలిండర్.. వారం రోజులు దాటినా అడ్రస్ లేకుండా పోతోంది. ఆన్‌లైన్ బుకింగ్ సిస్టమ్ తరచూ మొరాయిస్తుండటంతో వినియోగదారులు ఏజెన్సీల చుట్టూ తిరగాల్సి వస్తోంది. “నాలుగు రోజుల కిందట బుక్ చేశాం.. ఇంకా రాలేదు” అని అడిగితే.. స్టాక్ లేదు అనే సమాధానం ఏజెన్సీల నుంచి ఎదురవుతోంది. కానీ అదే సమయంలో తెర వెనుక మరో దందా నడుస్తోంది. సామాన్యులకు అందాల్సిన రాయితీ (డొమెస్టిక్) సిలిండర్లు అక్రమ మార్గంలో వాణిజ్య (కమర్షియల్) అవసరాలకు తరలుతున్నాయి. ఇంటి అవసరాలకు వాడాల్సిన సిలిండర్లను ఏజెన్సీలు అధిక ధరలకు హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు, క్యాంటీన్లకు విక్రయిస్తున్నాయి. డొమెస్టిక్ సిలిండర్ల నుంచి గ్యాస్‌ను చిన్న సిలిండర్లలోకి రీఫిల్లింగ్ చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఫలితంగా డొమెస్టిక్ కస్టమర్లకు అందాల్సిన కోటా తగ్గిపోతోంది. అవకాశాన్ని ఆసరాగా చేసుకుని కొందరు దళారులు రంగంలోకి దిగారు. అధికారిక ధర కంటే రూ.300 నుండి రూ.500 అదనంగా వసూలు చేస్తూ బ్లాక్ మార్కెట్‌లో సిలిండర్లను విక్రయిస్తున్నారు. అత్యవసరమైన వారు వేరే దారి లేక అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారు.
ఏజెన్సీల వద్ద క్యూలు..
నల్లగొండ, సూర్యాపేట, మిర్యాలగూడ, భువనగిరి వంటి ప్రధాన పట్టణాల్లో గ్యాస్ ఏజెన్సీల ముందు తెల్లవారుజాము నుంచే జనం క్యూ కడుతున్నారు. ఆన్‌లైన్ బుకింగ్ చేసినా ‘అవుట్ ఆఫ్ స్టాక్’ అని వస్తుండటంతో, నేరుగా గోడౌన్ల వద్దకు వెళ్లి సిలిండర్ల కోసం ఎగబడుతున్నారు. డెలివరీ వాహనాలు రాగానే జనం వాటిని ముట్టడిస్తున్న ఘటనలు లేకపోలేదు. ప్రస్తుతం కమర్షియల్ సిలిండర్ల సరఫరా దాదాపు 80 శాతం వరకు పడిపోయింది. దీనివల్ల హోటల్ యజమానులు డొమెస్టిక్ సిలిండర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా సామాన్య గృహిణులకు అందాల్సిన కోటా పక్కదారి పడుతోంది. డొమెస్టిక్ సిలిండర్ వెయిటింగ్ పీరియడ్ 2 రోజుల నుంచి 10 నుంచి 15 రోజులకు పెరిగింది. ఇక చిరు వ్యాపారుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యింది. అయితే గ్యాస్ దొరక్కపోవడంతో గ్రామాల్లోని టీ స్టాళ్లు మళ్లీ కట్టెల పొయ్యిని ఆశ్రయిస్తున్నాయి. ఇకపోతే పట్టణాల్లో గ్యాస్ ఖర్చు పెరగడంతో స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్‌లో దోశ, ఇడ్లీ, టీ ధరలను రూ.5 నుంచి రూ.10 వరకు పెంచేశారు. ప్రముఖ హోటల్స్, ఇతర హోటల్స్‌లో టిఫిన్స్‌పై ఏకంగా రూ.20 పెంచేశారు. స్టాక్ లేక కొన్ని చిన్న హోటళ్లు మధ్యాహ్నం వేళ భోజనం నిలిపివేస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గ్యాస్ కష్టాలకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది.

