కలం, సెంట్రల్ డెస్క్ : మారుతున్న వాతావరణ పరిస్థితులు కేవలం శారీరక ఆరోగ్యంపైనే కాకుండా మానసిక స్థితిపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ఎండ వేడి, వాయు కాలుష్యం కలిసి మనుషుల్లో ఆత్మహత్య ఆలోచనలను ప్రేరేపిస్తున్నట్లు యూనివర్సిటీ ఆఫ్ ఉటా హెల్త్ అండ్ హంట్స్‌మన్ మెంటల్ హెల్త్ ఇన్‌స్టిట్యూట్ (University of Utah) కు చెందిన పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా వాతావరణంలో వేడితో పాటు నైట్రోజన్ డయాక్సైడ్ స్థాయిలు పెరిగినప్పుడు ఈ ప్రమాదం 50 శాతం వరకు అధికమవుతోందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ తరహా పరిస్థితుల కారణంగా అమెరికాలోని యుటా స్టేట్లో 2000 నుంచి 2016 మధ్య 7,500 కంటే ఎక్కువ మంది ఆత్మహత్య చేసుకున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ‘ఎన్విరాన్‌మెంట్ ఇంటర్నేషనల్’అనే జర్నల్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. ఆత్మహత్యకు ముందు ఉండే 2 వారాల సమయం అత్యంత కీలకం. ఆ సమయంలో పర్యావరణ మార్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని యూనివర్సిటీ ఆఫ్ ఉటా హెల్త్కు చెందిన సైకియాట్రి రీసెర్చర్, ఈ స్టడీ సీనియర్ ఆథర్ అమాండా బాకియన్ తెలిపారు.
‘వెట్ బల్బ్ గ్లోబ్ టెంపరేచర్’ (WBGT) విధానంతో రికార్డు..
వాతావరణంలోని ఉష్ణోగ్రతను కొలిచేందుకు రీసెర్చర్లు ‘వెట్ బల్బ్ గ్లోబ్ టెంపరేచర్’ (WBGT) అనే విధానాన్ని ఉపయోగించారు. వాతావరణంలోని తేమ, గాలిలో వేగం, మేఘావృతమై ఆకాశం వంటి అంశాలపై పరిశోధనలు చేశారు. బాడీ టెంపరేచర్నూ రికార్డు చేశారు. వేడి ఎక్కువ ఉన్నప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన పెరిగినట్లు స్టడీలో తేలింది. టెంపరేచర్ 9 డిగ్రీల ఫారన్హీట్ పెరిగినా కొద్దీ.. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన 5 శాతం పెరిగింది. ప్రధానంగా మార్చి చివరి నుంచి సెప్టెంబర్ చివరి వరకు ఈ ప్రభావం ఎక్కువగా కనిపించింది.
ఆందోళన వ్యక్తం చేస్తున్న రీసెర్చర్లు..
వాహనాలు, ఫ్యాక్టరీల నుంచి వెలువడే నైట్రోజన్ డయాక్సైడ్ మనిషిపై అంత పెద్ద ప్రభావం చూపకపోయినా, అది వేడితో కలిసినప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన పెరుగుతుంది. ఎండాకాలంలో నైట్రోజన్ డై ఆక్సైడ్ స్థాయి ఎక్కువ ఉన్నప్పుడు ప్రతి 9 డిగ్రీల ఫారన్హీట్ టెంపరేచర్ వద్ద ఆత్మహత్య ముప్పు ఏకంగా 50 శాతం వరకు పెరిగింది. చలికాలంలో ఉష్ణోగ్రతతో సంబంధం లేకుండా, గాలిలో నైట్రోజన్ డయాక్సైడ్ పరిమాణం పెరిగితే ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనా పెరిగింది. వాతావరణంలో వస్తున్న మార్పులు, పెరుగుతున్న వడగాల్పులు భవిష్యత్తులో ఆత్మహత్య ముప్పును మరింత పెంచే అవకాశం ఉందని రీసెర్చర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాయు కాలుష్యాన్ని తగ్గించడం, తీవ్రమైన వేడి నుంచి ప్రజలను రక్షించే పర్యావరణ విధానాలే.. ఆత్మహత్యల నివారణలో కీలక పాత్ర పోషిస్తాయని ఈ అధ్యయనం సూచిస్తున్నది.
సెరోటిన్ ఉత్పత్తి తగ్గడంతో..
మన శరీరంలో కలిగే కొన్ని రసాయనిక, శారీరక మార్పులే ఆత్మహత్య ఆలోచనలకు ప్రధాన కారణమవుతాయని రీసెర్చర్లు తెలిపారు. మన మెదడులో ‘సెరోటోనిన్’ అనే రసాయనం ఉంటుంది. ఇది మన మూడ్ బాగుండటానికి, ప్రశాంతంగా ఉండటానికి సహాయపడుతుంది. వాతావరణంలో వేడి పెరిగినప్పుడు, శరీరం తన టెంపరేచర్ను నియంత్రించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ ప్రక్రియలో సెరోటోనిన్ ఉత్పత్తి పడిపోతుంది. అప్పటికే శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడ్తున్న వ్యక్తిలో దీని ఉత్పత్తి మరింత తగ్గుతుంది. సెరోటోనిన్ తగ్గితే మనిషిలో తీవ్రమైన నిరాశ, దూకుడు పెరుగుతాయి. దీనికితోడు గాల్లోని నైట్రోజన్ డయాక్సైడ్, సూక్ష్మ ధూళికణాలు శ్వాస ద్వారా రక్తంలోకి, అక్కడి నుంచి నేరుగా మెదడులోకి చేరుతాయి. ఇవి మెదడులోని కణాలను ప్రభావితం చేస్తాయి. దీంతో మెదడు పనితీరు మందగించి, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, భావోద్వేగాలను అదుపు చేసుకోలేక ఆత్మహత్యకు ప్రేరేపిస్తాయి.

