కలం, తెలంగాణ బ్యూరో : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలన్నీ కేవలం హైదరాబాద్ నగరానికే పరిమితం కాకుండా జిల్లాలకూ విస్తరించాలని, ఇందుకు అనువైన వాతావరణాన్ని సంబంధిత శాఖ అధికారులు సృష్టించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. ఐటీ కంపెనీలతో పాటు డాటా సెంటర్లు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, క్లౌడ్ స్టేషన్లు జిల్లాల్లోనూ ఏర్పాటు కావాలన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఐటీ పాలసీని రూపొందించాలని అధికారులకు స్పష్టం చేశారు. ఐటీ, ఇండస్ట్రీ డిపార్టుమెంట్లతో బుధవారం రివ్యూ సందర్భంగా ఈ సెక్టార్లో ప్రభుత్వ విధానాలపై కొన్ని సూచనలు చేశారు. ఐటీ వెలుగులు జిల్లాలకు కూడా విస్తరించే విధంగా ‘బియాండ్ క్యూర్’ ఆలోచన ఉండాలన్నారు. హైదరాబాద్ వెలుపల ఇలాంటివి ఏర్పాటు చేసే కంపెనీలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలను ఇస్తుందన్నారు. నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ హైవేల వెంట వీటిని ఏర్పాటు చేసేలా అధికారులు చొరవ తీసుకోవాలన్నారు.
నెట్ జీరో సిటీగా ఫ్యూచర్ సిటీ :
జిల్లాల్లో ఐటీ కంపెనీలు, డాటా సెంటర్లు వస్తే అక్కడి యువతకు కూడా ఉపాధి అవకాశాలు లభిస్తాయని గుర్తుచేసిన సీఎం.. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో నెలకొల్పేందుకు ఉన్న అనుకూల, ప్రతికూల పరిస్థితులను అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. కోర్ అర్బన్ రీజియన్ వెలుపల ఐటీ పరిశ్రమలు, డేడా సెంటర్లకు ఎక్కడ అనువైన ప్రాంతాలు ఉన్నాయో గుర్తించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ‘భారత్ ఫ్యూచర్ సిటీ’లో ప్రపంచ స్థాయి మౌలిక వసతులు ఉంటాయని, దీనికి తోడు పర్యావరణానికి అనుకూలంగా ఉండే ‘నెట్-జీరో’ విధానాలు అమలు చేయాలని ఆదేశించారు. ఫ్యూచర్ సిటీలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ, హెల్త్ సిటీ, ఇండస్ట్రియల్ కారిడార్ తదితరాలు ఉంటాయని, వీటికి అవసరమైన పనులను వేగవంతం చేయాలన్నారు.
ఫ్యూచర్ సిటీలో హెల్త్ టూరిజం సెంటర్ :
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించిన ఐదు ప్రాంతీయ వైద్య పర్యాటక (హెల్త్ టూరిజం) కేంద్రాల్లో ఒకటి ఫ్యూచర్ సిటీలోని హెల్త్ సిటీలో ఏర్పాటు చేయడంపై అధికారులకు సూచనలిచ్చారు. ఇందుకోసం కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతుందని తెలిపారు. అవసరమైతే ప్రధానితో మాట్లాడుతానని సీఎం తెలిపారు. ఫ్యూచర్ సిటీలో ప్రతిపాదిత ఏఐ సిటీ పనులను వెంటనే ప్రారంభించే విధంగా, ప్రపంచంలోనే గొప్ప ఏఐ సదుపాయాలుండేలా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఫ్యూచర్ సిటీ పారిశ్రామిక కారిడార్లో వివిధ కంపెనీలకు సంబంధించిన ప్రాంగణాల్లో త్వరలో భూమి పూజ చేసేందుకు వీలుగా పనులు చేపట్టాలన్నారు. ఫ్యూచర్ సిటీలో స్థాపించే కంపెనీలన్నీ స్కిల్ డెవలప్మెంట్ కోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో ఒప్పందాలు కుదుర్చుకునేలా చూడాలన్నారు.
ఇన్వెస్ట్ తెలంగాణ’ ఏజెన్సీకి సన్నాహాలు :
రాష్ట్రానికి భారీ పెట్టుబడులు రప్పించేందుకు ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ పేరుతో ప్రత్యేక ఏజెన్సీని ఏర్పాటు చేయాలని సీఎం తెలిపారు. పెట్టుబడిదారులకు ఒకే వేదికపై అన్ని రకాల అనుమతులు, సర్వీసులు అందేలా ఈ వ్యవస్థ ఉండాలన్నారు. ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ పేరుతోనే ప్రభుత్వం ఒక సొసైటీని ఏర్పాటు చేయనున్నదని, అందులో ఐటీ, పరిశ్రమ శాఖలకు సంబంధించిన అధికారులు ఉంటారన్నారు. వారి ఆధ్వర్యంలో ఇది నడుస్తుందని తెలిపారు. ఎనర్జీ, ఫైనాన్స్ వంటి శాఖల అధికారులు ‘ఇన్వెస్ట్ తెలంగాణ’లో ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారని వివరించారు. ఈ ఏజెన్సీని ఏర్పాటు చేయడంలో ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేసి అవసరమైన తీరులో అన్వయించుకోవాలన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులతో వచ్చే కంపెనీలకు సంపూర్ణంగా తోడ్పాటునందిస్తూ సహకరించేలా ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ పని చేయాలని అధికారులను ఆదేశించారు. మూడు నెలల్లోనే అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ‘టీ-ఫైబర్ ఇంటర్నెట్’ వినియోగంలోకి రావాలని సీఎం స్పష్టం చేశారు. ఇప్పటికే ‘టీ-ఫైబర్’కు మారిన ప్రభుత్వ కార్యాలయాల నుంచి రూ.54 కోట్ల ఆర్డర్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

