కలం, స్పోర్ట్స్ బ్యూరో: 1975లో పోర్చుగల్ నుంచి స్వాతంత్య్రం పొందిన ఒక చిన్న ఆఫ్రికన్ ద్వీప దేశం. 2000వ సంవత్సరం నాటికి ఫిఫా (FIFA) ర్యాంకింగ్స్‌లో 180 కంటే దిగువన పడిపోయిన పరిస్థితి… కానీ, నేడు అదే దేశం ప్రపంచ ఫుట్‌బాల్ వేదికపై దిగ్గజ జట్లను గడగడలాడించింది. 5 లక్షలకు మించని జనాభా కలిగిన ఆ బుల్లి దేశమే కేప్ వెర్డె (Cape Verde). ప్రపంచకప్ నాకౌట్ చేరిన అత్యంత చిన్న దేశంగా సరికొత్త చరిత్ర సృష్టించిన ఈ పసికూన ప్రస్థానం వెనుక దశాబ్దాల వ్యూహం దాగుంది.
‘రక్త సంబంధం’ వెతికి పట్టుకున్న వ్యూహం!
ఐరోపా వ్యాప్తంగా స్థిరపడిన తమ దేశ సంతతి రక్తాన్ని కేప్ వెర్డె ఫుట్‌బాల్ సమాఖ్య వేతికి పట్టుకుంది. ఆ యువ ప్రతిభను గుర్తించి జాతీయ జట్టుగా ఏకం చేసింది. ఐరోపా లీగ్‌ల ఆధునిక శిక్షణ, కఠినమైన ఫిజికల్, మెంటల్ టఫ్నెస్ క్యాంప్‌ల ద్వారా ఈ పసికూనలను మైదానంలో వేటాడే పులుల్లా తీర్చిదిద్దింది.
ఫిఫాలో సరికొత్త చరిత్ర
ఈ వ్యూహాత్మక బలంతోనే టోర్నీ ప్రారంభానికి ముందు ‘గ్రూప్-ఈ’లోనే బలవుతుందనుకున్న అందరి అంచనాలను కేప్ వెర్డె తలకిందులు చేసింది. లీగ్ దశలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా.. మాజీ ప్రపంచ విజేత స్పెయిన్‌ను (0-0), సాకర్ దిగ్గజం ఉరుగ్వేను (2-2) డ్రాలతో ఊపిరాడకుండా అడ్డుకుని షాకిచ్చింది. ఆపై సౌదీ అరేబియాను మట్టికరిపించి నాకౌట్ బెర్త్ను కొల్లగొట్టింది. తద్వారా ఫిఫా ప్రపంచకప్ నాకౌట్ (రౌండ్ ఆఫ్ 32) చేరిన అత్యంత చిన్న దేశంగా సరికొత్త చరిత్ర సృష్టించింది.
ప్రపంచ విజేత అర్జెంటీనాకే ‘గోల్’ తిప్పలు
నాకౌట్ సమరంలో ఈ పసికూన సృష్టించిన సునామీకి డిఫెండింగ్ ఛాంపియన్లే గడగడలాడారు. మెస్సీ, అల్వారెజ్ వంటి వేల కోట్ల మార్కెట్ విలువ కలిగిన ప్రపంచ ధనిక క్లబ్ స్టార్లను.. అసలు సరైన కాంట్రాక్టులు కూడా లేని కేప్ వెర్డె ఆటగాళ్లు తమ పట్టుదలతో ముచ్చెమటలు పట్టించారు. ఉక్కులాంటి డిఫెన్స్, మెరుపు కౌంటర్ ఎటాక్స్తో అర్జెంటీనా ఆధిక్యం సాధించిన ప్రతిసారీ ఏమాత్రం వెరవకుండా స్కోరును 2-2తో సమం చేసి, ఆటను ఎక్స్ట్రా టైమ్ వరకు తీసుకెళ్లిన వీరి వ్యూహాత్మక చొరవ సాకర్ పండితులనే ఆశ్చర్యపరిచింది. అయితే, 111వ నిమిషంలో దురదృష్టవశాత్తూ జరిగిన ఓన్-గోల్ కేప్ వెర్డెను దెబ్బతీసింది. లేకపోతే మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు వెళ్లి ఫలితం మరోలా ఉండేది.
అనామక గోల్ కీపరే.. అసలైన హీరో!
ఈ మ్యాచ్‌లో అసలైన హీరో ప్రస్తుతం ఏ క్లబ్‌కు ఆడని కేప్ వెర్డె 40 ఏండ్ల వెటరన్ గోల్కీపర్ వోజిన్హా. ప్రపంచ అత్యుత్తమ ఆటగాడు లియోనెల్ మెస్సీ సంధించిన 5 ప్రమాదకర షాట్లతో పాటు అర్జెంటీనా స్ట్రైకర్ల మొత్తం 10 గోల్ ప్రయత్నాలను.. ఈ అనామక గోల్ కీపర్ పిల్లిలా దూకుతూ అడ్డుకున్నాడు. ప్రపంచకప్ చరిత్రలోనే అత్యుత్తమమైన ఈ ప్రదర్శనకు ఫిదా అయిన మెస్సీ.. మ్యాచ్ ముగిశాక వోజిన్హాను స్వయంగా కౌగిలించుకుని సెల్యూట్ చేయడం విశేషం.
ఓటమినా? కాదు విజయోత్సవం!
ఈ వీరోచిత ఓటమి కేప్ వెర్డె పాలిట విజయం కంటే ఎక్కువ ఆనందాన్ని ఇచ్చింది. మ్యాచ్ ముగిసిన వెంటనే రాజధాని ప్రియా నగర వీధుల్లో వేలాది మంది ప్రజలు జాతీయ జెండాలతో రోడ్లపైకి వచ్చి నృత్యాలు చేస్తూ పండగ చేసుకున్నారు. తమ ఆటగాళ్లు ప్రపంచ వేదికపై చూపిన సాహసాన్ని ఆ దేశ అధ్యక్షుడు సైతం ప్రత్యేకంగా అభినందించారు. స్కోరు బోర్డుపై ఓడినా.. ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానుల గుండెల్లో కేప్ వెర్డె నిజమైన విజేతగా నిలిచింది.

