Mobile Popup Ad
Mobile Popup Ad

గవర్నర్‌తో సీఎం రేవంత్ భేటీ.. విద్యారంగంపై చర్చ

కలం, వెబ్ డెస్క్: లోక్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) భేటీ అయ్యారు. విద్యా రంగానికి సంబంధించి వివిధ అంశాలతో పాటు, వచ్చే జూన్ 12 వ తేదీన హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసే కార్యక్రమంలో గవర్నర్ ఆధ్వర్యంలో చేపట్టనున్న అవగాహన కార్యక్రమంపై చర్చించారు. ప్రధానంగా విద్యా సంస్థల్లో డ్రగ్స్ నియంత్రణపై అవగాహన కల్పించాలని గవర్నర్ సూచించారు. అందుకోసం విద్యార్థులతో ప్రమాణం చేయించేలా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. స్కూళ్ళు, కాలేజీల అడ్మిషన్ల సమయంలోనే మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రమాణపత్రం తీసుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు. గవర్నర్ సూచనలను పరిగణనలోకి తీసుకుని అవసరమైన చర్యలు తీసుకుంటామని ఈ మేరకు సీఎం వివరించారు.

ఈ మీటింగ్‌లో మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ రాజకీయ భవితవ్యంపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ పదవికి సంబంధించి సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆరు నెలల లోపు శాసన సభ లేదా శాసన మండలి సభ్యుడిగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. అజారుద్దీన్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఈ నెల 30వ తేదీ నాటికి సరిగ్గా ఆరు నెలలు పూర్తి కానున్నాయి. మరో 10 రోజుల్లోపు ఆయన అసెంబ్లీ/కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నిక కాకపోతే మంత్రి పదవిని కోల్పోవాల్సి ఉంటుంది. ఈ తరుణంలో గవర్నర్‌తో సీఎం భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>