కలం, వెబ్ డెస్క్: నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలన్న లక్ష్యంతో విద్యా శాఖలో తీసుకుంటున్న నిర్ణయాలు వెనుకడుగు వేయకుండా అమలు చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉందని సీఎం రేవంత్ (CM Revanth) అన్నారు. ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా విద్యా శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన విద్యా వారోత్సవాల కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యా శాఖ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించారు. కోర్ అర్బన్ ఏరియా (CURE)లో రూ.1,011 కోట్లతో నిర్మించే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. పాఠశాలలు దేశ భవిష్యత్తు నిర్మాణ వేదికలు అని సీఎం వ్యాఖ్యానించారు. ఆ వేదికలను పునరుద్ధరించే ప్రక్రియకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలను అనాధలుగా చూడదలుచుకోలేదని.. తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తతో చూసుకుంటారో అదే రీతిలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలను చూసుకోవాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని చెప్పారు.
ప్రపంచ వ్యాప్తంగా విద్యా రంగంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయని సీఎం అన్నారు. సిలబస్ మారుతోందని.. ఏఐ వచ్చిందని వివరించారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మారిందని చెప్పారు. దేశంలోనే అత్యుత్తమంగా ఉండాలన్న ఆలోచనల మేరకు నర్సరీ నుంచి 12 వ తరగతి వవరకు విద్యా విధానం అమలు చేస్తున్నామని చెప్పారు. “పాఠశాలల్లో మౌలిక సదుపాయాలే కాకుండా నిరుపేద కుటుంబాల పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పాఠశాలల్లో బలవర్ధకమైన ఆహారం అందించాలని నిర్ణయించామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడిలాంటిదని అన్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు రాకూడదని.. అందుకే వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయబోతున్నామని తెలిపారు. విద్యార్థుల కోసం పెట్టే ఖర్చు భవిష్యత్తరాలకు పెట్టుబడిగా భావిస్తున్నామని అన్నారు. భావి తరాలు ప్రభుత్వ పాఠశాలల్లోనే తయారు కావాలన్నారు. ప్రభుత్వ బడుల్లో చదువుతున్న లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లో ఉందని అన్నారు.
విద్యా రంగంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉండాలన్నది తన ఆకాంక్ష అని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. విద్యా రంగానికి ఏమాత్రం నిధుల కొరత రాకూడదని బడ్జెట్‌లో 8.22 శాతం నిధులను కేటాయించామని అన్నారు. రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల దృష్ట్యా ఒక్కసారిగా కాకుండా ఏటేటా పెంచుకుంటూ 15 శాతం వరకు కేటాయింపులు జరుపుతామని అన్నారు. మొదటగా హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాలో ఈ విధానాన్ని ప్రారంభిస్తున్నామని అన్నారు. రూ.1.34 కోట్ల జనాభా కలిగిన కోర్ అర్బన్ ఏరియాకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం వస్తున్న నిరుపేద కుటుంబాల పిల్లలకు మెరుగైన విద్యావకాశాలు కల్పించాలని రూ. 1700 కోట్లతో అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేశామని వివరించారు.

