శుభవార్త.. బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్

కలం, వెబ్ డెస్క్: అంగన్వాడీ చిన్నారులను సొంత బిడ్డల్లా చూసుకుని వారికి పౌష్టికాహారం అందించాలని అంగన్వాడీ సిబ్బందిని సీఎం రేవంత్ (CM Revanth) కోరారు. అసెంబ్లీ ప్రాంగణంలో శనివారం అంగన్వాడీ చిన్నారులకు బ్రేక్ ఫాస్ట్ పథకం “తొలి ముద్ద”ను (Breakfast Scheme) సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీం, చైల్డ్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ సీతా దయాకర్ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్‌లకు సీఎం మొబైల్ ఫోన్‌లను పంపిణీ చేశారు. దీంతో ఇకనుంచి అంగన్వాడీ చిన్నారులకు రెడీ టూ కుక్ ఫుడ్ (ఉప్మా, కిచిడీ మిక్స్)ను బ్రేక్ ఫాస్ట్‌గా రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది.

ఈ సందర్భంగా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ స్కీం ప్రారంభోత్సవానికి ఒక మంచి నేపథ్యం ఉందని చెప్పారు. గతంలో దేశంలో నిరక్షరాస్యతను తగ్గించేందుకు, వ్యవసాయ అభివృద్ధికి తొలి ప్రధాని నెహ్రూ విద్య, నీటిపారుదల శాఖలకు ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. దేశంలో ప్రస్తుతం ఫుడ్ సెక్యూరిటీ ఉంది.. కానీ న్యూట్రిషన్ ఫుడ్ అందడం లేదని చెప్పారు. అందుకే తమ ప్రభుత్వం బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచే తల్లికి పౌష్టిక ఆహారం అందిస్తోందని చెప్పారు. ఇప్పుడు బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని కూడా ప్రారంభించామని చెప్పారు.

ప్రభుత్వం ఎంత మంచి ప్రణాళికలు చేసినా అమలు చేయాల్సింది అంగన్వాడీ టీచర్లు మాత్రమేనని సీఎం స్పష్టం చేశారు. అందుకే ప్రభుత్వం మీపై గురుతర బాధ్యత పెట్టిందని చెప్పారు. అంగన్వాడీ చిన్నారులను సొంత బిడ్డల్లా చూసుకుని వారికి పౌష్టికాహారం అందించాలని కోరారు. అంగన్వాడీ సిబ్బందిని ప్రభుత్వం కుటుంబ సభ్యుల్లా భావిస్తోందని చెప్పారు. తమ సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చిస్తున్నామని అన్నారు. ఏ మాత్రం ఆర్ధిక వెసులుబాటు కలిగినా ముందుగా మీ సమస్యలనే పరిష్కరిస్తామని వివరించారు. అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో ఉండటానికి వీళ్లేదని.. సొంత భవనాలు నిర్మించేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. ఆరేళ్ల లోపు చిన్నారులకు పౌష్టికాహారం అందితేనే వారిలో మానసిక ఎదుగుదల ఉంటుందని అభిప్రాయపడ్డారు. పౌష్టికాహారం లేకపోవడం వల్లే ఎక్కువ సమస్యలు వస్తున్నాయని.. భవిష్యత్ లో అవే అనారోగ్య సమస్యలకు దారితీస్తున్నాయన్నారు. అలాంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకే ప్రభుత్వం ఇలాంటి పథకాలను ప్రవేశపెట్టిందని సీఎం (CM Revanth) వివరించారు.

Read Also: కేటీఆర్ ఆడే ఆట‌లు వేరు.. మంత్రి వాకిటి శ్రీహ‌రి కామెంట్స్‌!

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>