కలం, యాదగిరిగుట్ట : దేశ విద్యా రంగ అభివృద్ధికి, విద్యా అవకాశాల విస్తరణకు మౌలానా అబుల్ కలాం ఆజాద్ (Maulana Abul Kalam Azad) చేసిన సేవలు భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి అన్నారు. విద్య ద్వారానే సమాజంలో సమానత్వం, అభివృద్ధి సాధ్యమవుతాయని, ఆయన ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
మౌలానా అబుల్ కలాం ఆజాద్ 138వ జయంతిని పురస్కరించుకుని బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ (Yadadri Collectorate) సమావేశ మందిరంలో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో వెంకా రెడ్డి పాల్గొన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి, ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేజ్ చిస్తీతో పాటు జిల్లా అధికారులు, కుల సంఘాల నాయకులు కూడా ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు.
విద్యా రంగానికి దిక్సూచి..
దేశంలో విద్యాభివృద్ధికి, విద్యా వ్యవస్థ బలోపేతానికి ఆజాద్ చేసిన కృషిని ఈ సందర్భంగా పలువురు గుర్తుచేశారు. విద్య ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలన్న ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నేటి సమాజంపై ఉందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేజ్ చిస్తీ, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

