కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రైజింగ్-2047 విజన్‌తో ఆర్థికంగానే కాకుండా, అన్నీ రంగాల్లో తెలంగాణను ప్రపంచంలో నంబర్.1 గా నిలపాలన్నది తమ ప్రభుత్వ సంకల్పమని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేశారు. ఈ సంకల్పంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని కోరారు. CURE, PURE, RARE గా రాష్ట్రాన్ని వర్గీకరించుకున్నామని.. వాటి పరిధిలో సేవా, తయారీ, వ్యవసాయ రంగాల్లో ప్రపంచానికి ఆదర్శంగా తెలంగాణ ఎదగాలని ఆకాంక్షించారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా రాష్ట్రమంతటా గ్రామ సభలు జరుగుతున్న నేపథ్యంలో సీఎం రాష్ట్ర ప్రజలకు సందేశం అందించారు.
ప్రజా ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించి రెండు సంవత్సరాల మూడునెలలు పూర్తయ్యిందని తెలిపారు. ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ, గత పాలకుల తప్పిదాలను సరిచేస్తూ, సంక్షేమం, అభివృద్ధి విషయంలో రాజీపడకుండా మన ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. తాము పాలకులం కాదని.. సేవకులం అన్న భావనతో ప్రజల ఆకాంక్షలు, అవసరాలే కేంద్ర బిందువుగా నిత్యం శ్రమిస్తున్నామని చెప్పారు. ప్రతి నిర్ణయంలో ప్రజల మేలు, సామాజిక బాధ్యత, రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుంటున్నామని వివరించారు.
వరుస విజయాలతో ప్రజా పాలనకు ప్రజలు ఆమోదం..
ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో వరుస విజయాలతో ప్రజా పాలనకు ప్రజలు ఆమోదం, మద్ధతు ప్రకటించారని సీఎం తెలిపారు. ప్రజలు ఇచ్చిన ఈ ఫలితాలు తమ బాధ్యతను మరింత పెంచాయన్నారు. ప్రభుత్వ పథకాలు అంటే కాగితాలపై కాకుండా ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తేవాలన్నది ప్రజా ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. ఆ ఉద్దేశంతోనే “ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక” (Praja Palana- Pragathi Pranalika) పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు. మార్చి 6 నుండి 99 రోజుల పాటు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం ఒక ఉద్యమంలా సాగుతోందని పేర్కొన్నారు
పథకాలు అర్హులకు చేరేలా చూడాలి..
ఊరు వాడ సమస్యల పరిష్కారమే పరమావధిగా ప్రతి అధికారి పని చేయాలని సీఎం స్పష్టం చేశారు. వేగంగా ఫైళ్ల క్లియరెన్స్, ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత, నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలని ఆదేశించారు. మహాలక్ష్మి – ఉచిత బస్సు సౌకర్యం, రూ. 500 కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్ళు, మహిళా సాధికారత వంటి పథకాలు అర్హులకు చేరేలా ఈ కార్యక్రమం జరగాలని ఆకాంక్షించారు. ఈ 99 రోజుల కార్యాచరణ ఒక సాధారణ కార్యక్రమం కాదని.. ఒక దీక్ష అని పేర్కొన్నారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఒక్కటై దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా ఎదగాలని.. ఇదే తన కల అని స్పష్టం చేశారు. ఆ కలను సాకారం చేయడంలో ప్రతి తెలంగాణ బిడ్డ భాగస్వామి కావాలని ఆకాంక్షించారు.
Read Also: ఆటో ఎల్పీజీ సంక్షోభం.. బీజేపీ, కాంగ్రెస్ బ్లేమ్ గేమ్
Follow Us On : WhatsApp

