కలం, వెబ్ డెస్క్ : జూన్ 4, 2024 ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) పేర్కొన్నారు. విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని నడిపించాలని ప్రజలు ఇచ్చిన అపూర్వమైన తీర్పుకు నేటితో రెండేళ్లు పూర్తయ్యాయని తెలిపారు. ఆ విజయం తమకు అధికారం కాదని, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రజలు అప్పగించిన మహోన్నత బాధ్యత అని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటితో రెండేళ్లు పూర్తయిన సందర్భంగా సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ (X)లో చంద్రబాబు నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రజలు తమపై ఉంచిన విశ్వాసాన్ని గౌరవిస్తూ, వారి ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రతి క్షణం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనే లక్ష్యంగా రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు, కార్మికులు సహా ప్రతి వర్గం సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. అసమానతలు లేని సమాజ నిర్మాణంతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ఆంధ్రప్రదేశ్‌ను హెల్తీ, వెల్తీ, హ్యాపీ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ సంకల్పమని పేర్కొన్నారు. ప్రజలు గర్వపడేలా పాలన సాగిస్తున్నామని చెబుతూ, తమకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా తీర్పును గౌరవిస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఆయన వెల్లడించారు. ‘జై ఆంధ్రప్రదేశ్’ అంటూ తన సందేశాన్ని ముగించారు.

