కలం, వెబ్ డెస్క్: ఎమ్మెల్యేలు తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని సీఎం చంద్రబాబు (CM Chandrababu) హెచ్చరించారు. కొందరు హద్దులు దాటుతున్నారని.. అలాంటి వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Elections) వచ్చిన తీర్పుపై రివ్యూ చేసుకోవాలని ఆదేశించారు. కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రజా సేవపై దృష్టి పెట్టి.. వారి సమస్యలు పరిష్కరించాలన్నారు. పదవి వచ్చిందని గర్వపడి.. హద్దులు మీరొద్దన్నారు. ఇక జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి(Adinarayana Reddy)పై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జడ్పీ ఛైర్మన్ ఇవ్వలేదని అలగడమేంటన్నారు. అన్ని విషయాలు ముందే చర్చించుకుని అభ్యర్థిని సెలెక్ట్ చేసుకున్నాక.. ఇలా చేయడమేంటన్నారు. అలిగిన నేతలకు కౌన్సెలింగ్ ఇస్తామని.. అయినా వినకపోతే కఠిన చర్యలు తప్పవన్నారు.
శుభలేఖ ఇచ్చినా విష ప్రచారం..
వైఎస్ షర్మిల (YS Sharmila) కుమార్తె పెళ్లికి రావాలని తనకు శుభలేఖ ఇస్తే కూడా వైసీపీ నేతలు విష ప్రచారం చేయడం దారుణమని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. రాజకీయాలు, మానవ సంబంధాలు వేర్వేరు అన్నారు. అప్పట్లో తాను, వైఎస్ రాజకీయంగా ప్రత్యర్థులమైనా.. షర్మిల పెళ్లికి ఆహ్వానిస్తే వెళ్లానన్నారు. తాము ఇద్దరం మంచి స్నేహితులమని.. రాజకీయాలు తమ సంబంధాలపై ప్రభావం చూపలేదన్నారు. జగన్ వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. ప్రతిపక్షం పేరుతో విధ్వంసం సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
Also Read : ఈవీఎం, బ్యాలెట్.. ఎన్నికేదైనా కూటమిదే విజయం : చంద్రబాబు
Follow Us On : WhatsApp

