కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహిళల ఆర్థిక స్వావలంబన, భద్రత, బాలికల విద్యకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి(Srinivas Reddy) అన్నారు. శనివారం నగరంలోని 41వ డివిజన్ సద్దలగుండులో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి, ఇందిరమ్మ జీవిత బీమా పథకం పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి కుటుంబాల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, పిల్లల చదువులు, వైద్య ఖర్చులు, ఇంటి నిర్వహణ భారంతో కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబంలో ఇద్దరు సంపాదించాల్సిన అవసరం ఏర్పడిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మహిళలు వ్యాపారాలు చేసుకునేందుకు, కూలి పనులకు వెళ్లేందుకు, ఇతర వృత్తుల్లో పనిచేసేందుకు ఆర్థిక వెసులుబాటు కల్పించడంతో పాటు వారి ప్రయాణ ఖర్చులను తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిందని తెలిపారు.
పేద కుటుంబాలకు నాణ్యమైన ఆహారం అందించాలనే లక్ష్యంతో రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. గతంలో రేషన్ ద్వారా వచ్చిన దొడ్డు బియ్యాన్ని విక్రయించి, మార్కెట్లో సన్న బియ్యం కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉండేదని గుర్తుచేశారు. ప్రస్తుతం రేషన్ దుకాణాల నుంచే సన్న బియ్యం అందుతుండటంతో పేద కుటుంబాలకు ఆర్థిక వెసులుబాటు కలుగుతోందన్నారు. మహబూబ్‌నగర్ నగరంలో 16 వేల మందికి రేషన్ కార్డులు అందజేశామని, అర్హులైన కుటుంబ సభ్యుల పేర్లను కూడా కొత్తగా కార్డుల్లో చేర్చేందుకు చర్యలు తీసుకున్నామని వివరించారు.
మహబూబ్‌నగర్ పట్టణంలో ఇప్పటికే సుమారు 2,500 మందికి కొత్త పెన్షన్లు మంజూరు చేసినట్లు తెలిపారు. అర్హత ఉండి ఇంకా పెన్షన్ పొందని వారికి తదుపరి విడతల్లో అవకాశం కల్పిస్తామని చెప్పారు. పేద కుటుంబాల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఇప్పటికే 5,000 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయగా చాలామంది గృహ ప్రవేశాలు చేసుకొన్నారని చెప్పారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ మమత శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సురేందర్‌రెడ్డి, ముడా ఛైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ నర్సింహారెడ్డి, స్థానిక కార్పొరేటర్ లక్ష్మి, డీసీసీ ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిరాజ్ ఖాద్రీ, తదితరులు పాల్గొన్నారు.

