కలం, వెబ్ డెస్క్: ఏపీలోని సచివాలయంలో శుక్రవారం సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన రెండో రోజు కలెక్టర్ల సదస్సు (Collectors Conference Day 2) కానుంది. సంజీవని, సమ్మర్ యాక్షన్ ప్లాన్, సంక్షేమం, సూపర్ సిక్స్ అంశాలపై ముఖ్యమంత్రి ప్రధానంగా చర్చించనున్నారు. వీటితోపాటుగా రాష్ట్ర రెవెన్యూ, రాష్ట్ర ఖజానాకు ఆదాయం చేకూరే వివిధ శాఖలు,, విద్య, నైపుణ్యాభివృద్ధి అంశాలపైనా చర్చించనున్నారు ఇక సాయంత్రం శాంతి భద్రతలపై జిల్లా ఎస్పీలు, పోలీసు ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి? అనే అంశంపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. పలు కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది.
తొలిరోజు గురువారం దాదాపు 11 గంటల పాటు కలెక్టర్ల సదస్సు సుదీర్ఘంగా సాగింది. ఈ మీటింగ్ కి ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షత వహించారు. సమావేశంలో 7 అంశాలపై చర్చించారు. తొలుత కలెక్టర్లు అమలు చేసిన ఉత్తమ విధానాలను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేలా సీఎం నిర్ణయించారు. బెస్ట్ ప్రాక్టీసెస్‌ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే బాధ్యతను ఆయా జిల్లాల కలెక్టర్లకు సీఎం అప్పగించారు. 9 బెస్ట్ విధానాలను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే బాధ్యతను 10 మంది కలెక్టర్లకు అప్పగించారు. స్మార్ట్ కిచెన్స్ కు కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, సంజీవని ప్రాజెక్టు కు చిత్తూరు, పల్నాడు జిల్లాల కలెక్టర్లు సుమిత్, కృతికా శుక్లా, జలధార ప్రాజెక్టుకు అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్ లను మెంటార్లుగా నియామకం అయ్యారు.
ఇక రాష్ట్రంలో రెవెన్యూ సమస్యల పరిష్కారం దిశగా ఫోర్ విజిట్స్ ఏ విలేజ్ కాన్సెప్ట్ కు నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా, ముస్తాబు కార్యక్రమానికి పార్వతిపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, నెట్ జీరో కాన్సెప్ట్ కు అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్ లను సీఎం నియమించారు. దివ్యాంగులకు భరోసాగా ఉండే స్వాభిమాన్ కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్.. ఆక్వా, వ్యవసాయ వ్యర్థాల సమర్థ వినియోగం- సర్కులర్ ఎకానమీకి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి, అన్ లాకింగ్ వెల్త్ కాన్సెప్ట్ కు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ లను మెంటార్లుగా సీఎం నియమించారు.

