కలం, వెబ్ డెస్క్ : సింగపూర్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) రెండో రోజు అత్యంత కీలకమైన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పర్యటనలో భాగంగా ఆయన ప్రతిష్టాత్మక ‘CBN@361’ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా సాగుతున్న ఈ పర్యటనలో నేడు నిర్వహించనున్న ‘APAC సెమికండక్టర్ రౌండ్ టేబుల్’ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సదస్సులో అంతర్జాతీయ సెమికండక్టర్ సంస్థల ప్రతినిధులతో సీఎం చర్చలు జరపనున్నారు.
అమరావతి రాజధాని నగర నిర్మాణమే ధ్యేయంగా సుర్బానా జురాంగ్ సంస్థ ప్రతినిధులతో ‘సుర్బానా జురాంగ్–అమరావతి ప్లానింగ్’ సమగ్ర సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం సింగపూర్ ఉప ప్రధాని కిమ్ యాంగ్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి బృందంతో చంద్రబాబు కీలక చర్చలు జరపనున్నారు. ఆధునిక నగరాల అభివృద్ధి నమూనాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో చంద్రబాబు ప్రసంగించనున్నారు.
రాష్ట్రానికి పారిశ్రామిక రంగాన్ని ఆకర్షించడమే ధ్యేయంగా సీఐఐ (CII) భాగస్వామ్య సదస్సు రోడ్ షోలో సీఎం పాల్గొంటారు. అమరావతి అభివృద్ధి, రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలపై పలు అంతర్జాతీయ సంస్థల అధినేతలతో ఆయన ముఖాముఖి చర్చలు జరపనున్నారు. రెండు రోజుల సింగపూర్ పర్యటనను ముగించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ఈ రాత్రికి స్వదేశానికి తిరుగుప్రయాణం కానున్నారు. రాత్రి 10 గంటల సమయానికి ఆయన హైదరాబాద్ చేరుకుంటారు.
సీఐఐ ఏపీ బిజినెస్ డెలిగేషన్‌తో భేటీ..
సీఐఐ ఏపీ బిజినెస్ డెలిగేషన్‌తో చంద్రబాబు నాయుడు సింగపూర్ లో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక అనుకూల వాతావరణాన్ని విదేశాల్లో బ్రాండ్ చేసే బాధ్యతను పారిశ్రామిక వేత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా సీఎం కోరారు. అదే విధంగా ఇతర దేశాల్లో ఉన్న టెక్నాలజీని, వ్యాపారాన్ని రాష్ట్రానికి పరిచయం చేయాలని కోరారు. ఫుడ్ ప్రాసెసింగ్ నుంచి సెమీ కండక్టర్ వరకు బెస్ట్ పాలసీలతో సిద్ధంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవసరం అయితే విదేశీ కంపెనీ భాగస్వామ్యంతో పరిశ్రమలు స్థాపించాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పలువురు పారిశ్రామికవేత్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

