Mobile Popup Ad
Mobile Popup Ad

ముగిసిన విద్యా వాలంటీర్ల స్క్రీనింగ్ టెస్ట్

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి చేపడుతున్న చర్యలు ప్రశంసనీయమని వందేమాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రవీందర్ అన్నారు. మహబూబ్‌నగర్ (Mahabubnagar) నియోజకవర్గంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో తన సొంత నిధులతో విద్యా వాలంటీర్లను (Vidya Volunteers) నియమించేందుకు బుధవారం నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్ స్థానిక మహబూబ్ నగర్ ఫస్ట్ కార్యాలయంలో ప్రశాంతంగా ముగిసింది. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే చేస్తున్న కృషి అభినందనీయం అని అన్నారు.

ప్రతి పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, విద్యార్థులకు ఎలా చదవాలో మార్గనిర్దేశం చేయడానికి విద్యా వాలంటీర్లను నియమించడం గొప్ప ముందడుగు అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్‌ను అన్ని రంగాల్లో ముందంజలో నిలపాలనే ఎమ్మెల్యే సంకల్పం ప్రత్యేకమని ఆయన తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే తన సొంత నిధులతో విద్యా వాలంటీర్ల నియామకాన్ని చేపట్టడం విద్యా రంగానికి ఎంతో ఉపయోగకరమని మహబూబ్ నగర్ ఫస్ట్ పర్యవేక్షకుడు గుండా మనోహర్ అన్నారు.

మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని 100 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా వాలంటీర్ల నియామకానికి సంబంధించి నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్ మహబూబ్ నగర్ ఫస్ట్ శిక్షణా కేంద్రంలో ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిసిందని తెలిపారు. ఈ పరీక్షకు నియోజకవర్గం నలుమూలల నుంచి నిరుద్యోగ యువత ఉత్సాహంగా హాజరై, మొత్తం 430 మంది పరీక్ష రాసినట్లు వెల్లడించారు. గత విద్యాసంవత్సరంలో నియోజకవర్గంలోని 33 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విద్యా వాలంటీర్లను నియమించిన ఎమ్మెల్యే, ఆ కార్యక్రమం ద్వారా గణనీయమైన ఫలితాలు సాధించడంతో ఈ విద్యాసంవత్సరం ప్రతి ప్రభుత్వ పాఠశాలలో వాలంటీర్లను నియమించాలని నిర్ణయించార‌న్నారు.

ఈ నిర్ణయం విద్యా వ్యవస్థ బలోపేతానికి దోహదం చేయడంతో పాటు, గ్రామీణ, పట్టణ ప్రాంతాల విద్యార్థులకు సమాన విద్యావకాశాలు కల్పించడంలో కీలకంగా మారనుంది. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ ఫస్ట్, వందేమాతరం ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించారు. పరీక్షా ప్రక్రియను పారదర్శకంగా, క్రమబద్ధంగా నిర్వహించడంపై నిర్వాహకులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యా ప్రమాణాలు మెరుగుపడటమే కాకుండా, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో కూడా ఇది కీలక పాత్ర పోషించనుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వందేమాతరం ఫౌండేషన్ కోఆర్డినేటర్ రవీందర్ రెడ్డి, మహబూబ్ నగర్ ఫస్ట్ ఇన్‌చార్జ్ నిజలింగప్ప, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>