కలం, వెబ్ డెస్క్: లెజెండరీ సింగర్, గానకోకిల ఎస్. జానకి చిత్రపటానికి సీఎం చంద్రబాబు (CM Chandrababu) నివాళులు అర్పించారు. క్యాంప్ కార్యాలయంలో ఎస్ జానకి చిత్రపటానికి పూలమాల వేసి పూలను సమర్పించి నమస్కరించారు. ఈ సందర్భంగా భారతీయ సంగీత రంగానికి ఆమె అందించిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు. తెలుగు నేలపై జన్మించిన ఎస్ జానకి ఆరు దశాబ్దాలకు పైగా తన అపూర్వ గానంతో కోట్లాది సంగీతాభిమానులను సొంతం చేసుకున్నారని కొనియాడారు.
ఆమె పాటలు అందరి హృదయాల్లో నిలిచిపోతాయని పేర్కొన్నారు. ఈ మేరకు జానకమ్మ కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆమె మృతి పట్ల సంతాపం తెలుపుతూ.. ఎస్. జానకి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థించారు. గాయని ఎస్. జానకి మరణంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. జానకి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అద్భుతమైన తన గాత్రంతో లక్షలాది సంగీత అభిమానులను ఎస్. జానకి సొంతం చేసుకున్నారని కొనియాడారు.
మైసూరులో ఎస్. జానకి అంత్యక్రియలు
నేడు మైసూరులో ఎస్. జానకి (88) అంత్యక్రియలు జరగనున్నాయి. అభిమానుల సందర్శనార్థం మైసూరులోని మహారాజ కళాశాల మైదానానికి పార్థివదేహం తీసుకువచ్చారు. సాయంత్రం 4 గంటలవరకు అక్కడే ఉంచనున్నారు. అక్కడ ఆమె అభిమానులు, పలువురు ప్రముఖులు చివరిసారిగా నివాళి అర్పిస్తున్నారు. అనంతరం కనియనహుండీ ఫామ్ హౌస్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
మైసూరులో ప్రభుత్వ లాంఛనాలతో ఎస్.జానకి అంత్యక్రియలు జరగనున్నాయి. గుండెపోటుతో ప్రముఖ గాయని ఎస్.జానకి (S. Janaki) శనివారం కన్నుమూశారు. మైసూరులోని ఆసుపత్రిలో వృద్ధాప్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు. వివిధ భాషల్లో సుమారు 50 వేలకు పైగా పాటలు పాడిన ఆమె.. 4 జాతీయ అవార్డులు, 33 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్నారు.
Read Also: నా ప్రశ్నించే స్వరం ఆగదు.. ప్రకాష్ రాజ్ ఫైర్
Follow Us On : WhatsApp

