Mobile Popup Ad
Mobile Popup Ad

సింగరేణిలో కనుమరుగవుతున్న భూగర్భ గనులు

​కలం, ఖమ్మం బ్యూరో : సింగరేణి (Singareni)  కాలరీస్ కంపెనీ లిమిటెడ్ చరిత్రలో ఒకప్పుడు వెన్నెముకగా నిలిచిన భూగర్భ గనులు ప్రస్తుతం మనుగడ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఆశించిన స్థాయిలో బొగ్గు ఉత్పత్తి కాకపోవడం, ఉత్పత్తి వ్యయం భారీగా పెరిగిపోవడంతో ఈ గనులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నాయి. గడిచిన ఇరవై ఏళ్ల కాలాన్ని పరిశీలిస్తే సంస్థ వ్యాప్తంగా దాదాపు 25 నుండి 30కి పైగా భూగర్భ గనులు మూతపడటం, ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులుగా మార్చబడటం జరిగింది.

2006 ప్రాంతంలో సింగరేణిలో 50కి పైగా భూగర్భ గనులు చురుగ్గా పనిచేస్తుండగా, ప్రస్తుతం 2026 నాటికి వాటి సంఖ్య కేవలం 22కి పడిపోయింది. అంటే ఈ రెండు దశాబ్దాల కాలంలోనే సగానికి పైగా భూగర్భ గనులు కనుమరుగయ్యాయి. 2005-06లో 50 భూగర్భ, 13 ఓపెన్ కాస్ట్ గనులు ఉండగా.. 2015-16 నాటికి 32 అండర్ గ్రౌండ్ లు, 16 ఓపెన్ కాస్ట్ లుగా మారాయి. ప్రస్తుతం ఆ సంఖ్య 22 యూజీలు, 18 ఓసీలుగా కొనసాగుతుంది. ప్రస్తుతం సింగరేణిలో భూగర్భ గనుల పనితీరుపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఉత్పత్తి వ్యయానికి, మార్కెట్ అమ్మకపు ధరకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉండటంతో సంస్థపై మోయలేని ఆర్థిక భారం పడుతోంది.

గడిచిన ఐదేళ్ల కాలంలోనే భూగర్భ గనుల వల్ల సంస్థకు ఏకంగా రూ. 13,127 కోట్ల నష్టం వాటిల్లింది. సంవత్సరాల వారీగా చూస్తే 2021 – 22లో రూ. 3,145 కోట్లు, 2022-23లో రూ. 2,421 కోట్లు, 2023-24లో రూ. 2,812 కోట్లు, 2024-25లో రూ. 2,212 కోట్లు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26లో రూ. 2,537 కోట్ల నష్టం వచ్చిందని సింగరేణి వార్షిక నివేదికలు వెల్లడిస్తున్నాయి.

ప్రస్తుతం సింగరేణి వ్యాప్తంగా ఉన్న గనుల్లో 16 చోట్ల యాంత్రీకరణ ద్వారా బొగ్గు ఉత్పత్తి చేస్తున్నప్పటికీ, యంత్రాలు నిర్దేశిత లక్ష్యాలను చేరుకోలేకపోతున్నాయి. ఫలితంగా భూగర్భ గనుల్లో ఒక టన్ను బొగ్గు ఉత్పత్తికి రూ. 11,198 ఖర్చు అవుతుండగా.. మార్కెట్లో టన్ను బొగ్గు కేవలం రూ. 4,410 కే లభిస్తుంది. దీంతో ప్రతి టన్ను బొగ్గుపై సంస్థ రూ. 6,788 చొప్పున నష్టపోవాల్సి వస్తోంది.

​మరోవైపు మార్కెట్‌లో మిగతా బొగ్గు పరిశ్రమలతో పోల్చితే సింగరేణి బొగ్గు ధర ఎక్కువగా ఉండటంతో వినియోగదారులు ఇతర కంపెనీల వైపు మొగ్గు చూపుతున్నారు. సింగరేణి టన్ను బొగ్గును రూ. 8,519 కి విక్రయిస్తుండగా, డబ్ల్యుసీఎల్ కంపెనీ రూ. 5,031 కి, కోల్ ఇండియా రూ. 4,412 చొప్పున అమ్ముతున్నాయి. సింగరేణి సంస్థ ఉత్పత్తి చేస్తున్న బొగ్గుకు ఖర్చు అధికంగా ఉన్న నేపథ్యంలో ఎక్కువ ధరకు విక్రయిస్తుండటంతో కొనుగోలుదారులు ఆసక్తి చూపడం లేదు. అలాగని ధర తగ్గిస్తే నష్టాలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. కోట్ల రూపాయల వ్యయంతో అండర్‌గ్రౌండ్ బావుల్లో ఏర్పాటు చేసిన ఆధునిక యంత్రాలు సైతం పూర్తి సామర్థ్యంతో పనిచేయకపోవడం ఈ సంక్షోభాన్ని మరింత పెంచింది.

రోజుకు 130 టన్నుల బొగ్గు తీయాల్సిన ఎస్డీఎల్ యంత్రం 86 టన్నులకే పరిమితమవ్వగా, 250 టన్నులు తీయాల్సిన ఎల్.హెచ్.డి యంత్రం 117 టన్నులు మాత్రమే వెలికితీస్తోంది. చివరకు రోజుకు 800 టన్నుల సామర్థ్యం గల కంటిన్యూస్ మైనర్ యంత్రాలు కూడా కేవలం 643 టన్నుల బొగ్గునే ఉత్పత్తి చేస్తున్నాయి. ​ఈ వైఫల్యాల ప్రభావం వార్షిక ఉత్పత్తిపై స్పష్టంగా కనిపిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భూగర్భ గనుల ద్వారా 72 లక్షల టన్నుల బొగ్గును వెలికి తీయాల్సి ఉండగా, కేవలం 41.38 లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి అయింది. దీనికి భిన్నంగా ఉపరితల (ఓపెన్‌కాస్ట్) గనుల ద్వారా రికార్డు స్థాయిలో 538.66 లక్షల టన్నుల బొగ్గును వెలికితీయడం విశేషం.

సింగరేణి యాజమాన్యం పాత, లాభసాటి కాని భూగర్భ గనులను మూసివేస్తూ ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులను విస్తరిస్తోందని భద్రాద్రి కొత్తగూడెం ఏఐటీయూసీ జాయింట్ సెక్రటరీ మేకల ఈశ్వర్ తెలిపారు. అందులో భాగంగానే ఇల్లందు ఏరియాలోని పాత అండర్‌గ్రౌండ్ బావులను మూసివేసి, అక్కడ జేకే ఓపెన్‌కాస్ట్ , వీకే ఓపెన్‌కాస్ట్ వంటి ఉపరితల గనులను వేగంగా విస్తరించారని అన్నారు. కానీ ఉపాధి పరంగా చూస్తే అండర్ గ్రౌండ్ మైన్స్ లో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని స్పష్టం చేశారు. ఓపెన్ కాస్ట్ లో 100 మందితో చేసే పని అండర్ గ్రౌండ్ లో 1000 మంది చేస్తారని… అంటే వెయ్యి మందికి ఉపాధి కల్పించబడుతుందన్నారు. కాబట్టి సింగరేణి భవిష్యత్తు దృష్ట్యా ఓపెన్ కాస్ట్ గనులు ఎంత అవసరమో, కార్మికుల సంక్షేమం దృష్ట్యా భూగర్భ గనులు కూడా అంతే అవసరం అని పేర్కొన్నారు. ప్రభుత్వ సంస్థలు కేవలం లాభాపేక్ష్య కోసమే కాకుండా ప్రజా ప్రయోజనాలు కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉందని వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>