Mobile Popup Ad
Mobile Popup Ad

రేషన్ లబ్దిదారులకు ముఖ్య గమనిక.. 3 నెలల కోటాకు లాస్ట్ డేట్ ఇదే!

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలోని అన్ని రేషన్ షాపుల వద్ద లబ్ధిదారుల తాకిడితో సందడి వాతావరణం నెలకొంది. తెల్లరేషన్ కార్డు దారులకు 3 నెలల కోటా ఒకేసారి పంపిణీ (Ration Distribution) చేస్తామని కేంద్రం ప్రకటించడంతో రేషన్ లబ్దిదారులు అలర్ట్ అయ్యారు. తమ కోటా బియ్యాన్ని తీసుకుపోయేందుకు తెల్లవారుజాము నుంచే షాపుల వద్ద క్యూ కడుతున్నారు. ఇప్పుడు బియ్యం తీసుకోకపోతే మరో నెల వరకు తీసుకునే ఛాన్స్ ఉండదనే భయంతో ముందే అప్రమత్తమయ్యారు. ఉదయం నుంచే ఎండలు ముదరడంతో ఉష్ణోగ్రతలు పెరుగకముందే సరుకు ఇంటికి చేరేలా తెల్లవారుజామునుంచే లైన్లు కట్టారు. రాష్ట్రంలో పలుచోట్ల రేషన్ కోసం కిటిలోమీటర్ల మేర లైన్లో నిలుచుకొని వేచిచూస్తున్నారు. గ్రామాల్లో కూలిపని చేసుకునే వారు.. పనికి వెళ్లాలని ముందే రేషన్ షాపుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. దీంతో రేషన్ షాపుల వద్ద జనసందోహం నెలకొంది. ఈ నెల మొదటి, రెండు వారాల్లో వచ్చిన కోటా అయిపోవడంతో.. మరో కోటా బియ్యం కోసం వేచిచూస్తున్నారు. ఈ కోటా కూడా అయిపోతే బియ్యం ఇస్తారో ఇవ్వరో అన్న ఆందోళనతో ముందే అప్రమత్తమయ్యారు. ఎన్నిగంటలు లైన్లో నిలుచున్నా సరే.. తమ కోటా బియ్యాన్ని ఇంటికి తీసుకెళ్లాల్సిందేనని నిర్ణయించుకున్నారు. వేసవి ఉష్ణోగ్రతల దృష్ట్యా 3 నెలల కోటా బియ్యాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకేసారి పంపిణీ చేయడం సంతోషకరమని లబ్ధిదారులు చెబుతున్నారు.

ఈ నెల 30 వరకు సమయం ఉంది..

3 నెలల కోటా బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయడంతో లబ్ధిదారులు పెద్ద ఎత్తున షాపుల వద్దకు చేరుకుంటున్నట్లు పౌరసరఫరా శాఖ అధికారులు తెలిపారు. సర్వర్ సమస్యలు, స్టాక్ ఇబ్బందులు తలెత్తడంతో ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని.. రేషన్ పంపిణీకి ఈ నెల 30 వరకు సమయం ఉందని అధికారులు స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ 3 నెలల బియ్యం అందుతాయని తెలిపారు. స్టాక్ విషయంలో ఎలాంటి కొరత లేదని.. సర్వర్ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని అన్నారు. ప్రజలు ఒకేసారి రేషన్ షాపుల వద్ద గుమిగూడకుండా సహకరించా విజ్ఞప్తి చేశారు.

మొరాయిస్తున్న ఈ-పోస్ మిషన్లు..

అయితే ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ ప్రక్రియ మొదలవ్వడంతో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. పౌరసరఫరాల శాఖ సర్వర్లపై ఒత్తిడి పెరగటంతో చాలా చోట్ల ఈ-పోస్ (e-PoS) మిషిన్లు హ్యాంగ్ అవుతున్నాయి. ముఖ్యంగా వృద్దుల వేలిముద్రలు పడకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు కొందరు మహిళలు సైతం ఈ వేలిముద్రల సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. కొన్నిచోట్ల అనుకున్న దానికంటే ఎక్కువ మంది రావడంతో స్టాక్ అయిపోయిందని డీలర్లు చెప్పడంతో వెనుదిరిగి వెళ్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>