కలం, నల్లగొండ బ్యూరో: చిట్యాల (Chityal) ప్రజలకు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham) గుడ్ న్యూస్ చెప్పారు. చిట్యాల పట్టణంలో దాదాపు 900 ఇండ్లను పేదలకు కేటాయిస్తామన్నారు. చిట్యాల పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు. గత పాలకులు ఐదేండ్లలో పేకాట, గంజాయి వంటి అసాంఘిక కార్యకలాపాలను పెంచి పోషించారని వీరేశం విమర్శించారు. పట్టణ అభివృద్ధికి సంబంధించి రూ.15 కోట్ల జీవో ఆర్డర్ కాపీని కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్దకు తీసుకువచ్చానన్నారు.
దీర్ఘకాల సమస్యల పరిష్కారానికి నిధులు
దీర్ఘకాలంగా ఉన్న విద్యుత్ సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు చేశామని, ‘అమృత్’ స్కీమ్ కింద రూ.12.50 కోట్లు మంజూరు చేసి శంకుస్థాపన చేశామని వివరించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి (LOC) ద్వారా రూ. 75 లక్షలు, మరో రూ.32 లక్షలు సీఎంఆర్‌ఎఫ్ (CMRF) ద్వారా మంజూరు చేశామని పేర్కొన్నారు. ప్రతి వార్డులో సీసీ రోడ్లు, డ్రెయినేజీ నిర్మాణ పనులు చేపడతామని హామీ ఇచ్చారు. 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇల్లు లేని పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల కేటాయింపు జరుగుతుందని చెప్పారు.
పట్టణ అభివృద్ధిలో భాగంగా అండర్ పాస్ నిర్మాణం పనులు శరవేగంగా చేపడతామని తెలిపారు. ప్రతి వార్డులో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కనకదుర్గ అమ్మవారి కల్యాణ మండపం నిర్మాణానికి రూ. 5 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. బతుకమ్మ కుంట అభివృద్ధికి రూ. 2.50 కోట్లు మంజూరు చేశామని పేర్కొన్నారు. చిట్యాల పట్టణ అభివృద్ధి, పేదల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని వీరేశం (Vemula Veeresham) చెప్పుకొచ్చారు.
Read Also: తెలంగాణ రాజకీయాలను మునుగోడు నుంచే శాసిస్తా : రాజగోపాల్ రెడ్డి
Follow Us On: Pinterest


