కలం, నకిరేకల్: నకిరేకల్ (Nakrekal) నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య (Chirumarthi Lingaiah) ఒక ‘పట్టిన శని, గ్రహణం’గా మారారని.. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాథగొని కొండయ్య, పీసీసీ డెలిగేట్ నకిరేకంటి ఏసుపాదం తీవ్రస్థాయిలో విమర్శించారు. గురువారం నకిరేకల్ మండలంలోని తాటికల్, చందంపల్లి, గొల్లగూడెం, నెల్లిబండ, నోముల గ్రామాలలో సెప్టెంబర్ 5న నిర్వహించనున్న ‘ప్రజా వికాస సభ’ను విజయవంతం చేయడానికి గ్రామ జనరల్ బాడీ సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్న గాథగొని కొండయ్య, నకిరేకంటి ఏసుపాదం మాట్లాడుతూ.. గత ఐదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నియోజకవర్గ అభివృద్ధిని పూర్తిగా దెబ్బతీశారని ఆరోపించారు. ప్రభుత్వ కార్యాలయాలను కూల్చివేస్తూ ప్రజాధనాన్ని వృథా చేశారని విమర్శించారు.
ప్రస్తుతం మళ్లీ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ‘దొంగే దొంగ’ అని అరిచినట్లుగా మాట్లాడటం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ నాయకులు ఎద్దేవా చేశారు. నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ప్రజా వికాస సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 5న నిర్వహించనున్న ప్రజా వికాస సభకు నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ సర్పంచ్‌లు యాస కర్ణాకర్ రెడ్డి, దాసరి వీరార్జున్ రెడ్డి, మెదబోయిన సైదులు, చానగాని సుధాకర్, మాచర్ల యాదగిరి, చిర్రబోయిన సత్యనారాయణ, ఆడెపు రాఘవులు, పొట్టబట్టుల వెంకటేశం, జన్రెడ్డి సోమయ్య తదితరులు పాల్గొన్నారు.

