కలం, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న సోషియో-ఫాంటసీ అడ్వెంచర్ చిత్రం ‘విశ్వంభర’ (Vishwambhara) పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. వశిష్ట దర్శకత్వంలో యువీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది. ఈ చిత్రం కోసం పలు ప్రముఖ వీఎఫ్ఎక్స్ స్టూడియోలు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాను దసరా పండుగ కానుకగా అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, గత కొన్ని వారాలుగా గ్రాఫిక్స్ పనులు శరవేగంగా జరుగుతుండటంతో చిత్ర బృందం ఈ విడుదల తేదీపై నమ్మకంతో ఉన్నట్లు తెలుస్తోంది.
ఫాంటసీ ప్రపంచాన్ని తెరపై ఆవిష్కరించేందుకు అవసరమైన సీజీ వర్క్ ఆలస్యమైంది. దీంతో మొదట్లో విడుదలపై ఆందోళన నెలకొన్నప్పటికీ, ప్రస్తుతం పనులు వేగవంతం కావడంతో మేకర్స్ ధీమాగా ఉన్నారు. మొదట విడుదలైన టీజర్‌కు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ అంచనాలను పెంచింది. ఐకానిక్ క్లాసిక్ ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ తర్వాత చిరంజీవి మళ్లీ పూర్తిస్థాయి సోషియో-ఫాంటసీ జోనర్‌లో నటిస్తుండటంతో ప్రేక్షకులు ఈ విజువల్ వండర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్రిష కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం వెండితెరపై ఒక దృశ్య కావ్యంగా అలరించడం ఖాయమని చిత్ర యూనిట్ పేర్కొంది.

