కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలోని నిరుద్యోగ మహిళలకు శుభవార్త. జిల్లాలోని 11 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న 178 అంగన్‌వాడీ టీచర్ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ అంకిత్ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ wdcw.tg.nic.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
35 ఏళ్ల లోపు వారు..
దరఖాస్తుదారులకు 2026 జూలై 1 నాటికి 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలని కలెక్టర్ అంకిత్ స్పష్టం చేశారు. అభ్యర్థులు తప్పనిసరిగా స్థానిక మహిళలై ఉండాలనే నిబంధన విధించారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 18వ తేదీ వరకు గడువు ఉందని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ పోస్టులను భర్తీ చేయడం ద్వారా స్థానికంగా సేవలు మరింత మెరుగవుతాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

