కలం, సూర్యాపేట: సూర్యాపేట (Suryapet) జిల్లా రూరల్ పరిధిలోని ఏర్కారం గ్రామ శివారులో కల్వర్టు కింద గోనె సంచిలో దొరికిన మాజీ సర్పంచ్ భర్త, బీఆర్ఎస్ నేత చింతలపాటి మధు (42) హత్య కేసును పోలీసులు 24 గంటల వ్యవధిలోనే ఛేదించారు. ఈ ఘోర హత్యకు పాల్పడిన ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుండి హత్యకు ఉపయోగించిన కారు, బైక్, కత్తి, 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ నరసింహ కేసు దర్యాప్తు, నిందితుల అరెస్ట్ వివరాలను వెల్లడించారు. 2007 సంవత్సరంలో ఏర్కారం గ్రామ సర్పంచ్ మిద్దె రవీందర్ హత్యకు గురయ్యారు. ఆ కేసులో చింతలపాటి మధు ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. తన తండ్రిని చంపిన మధుపై రవీందర్ కొడుకు మిద్దే జీవన్ ప్రతీకారంతో రగిలిపోయాడు. మధు బతికి ఉంటే తనకు కూడా ప్రాణహాని ఉందని భావించిన జీవన్, అతడిని ఎలాగైనా హతమార్చాలని పథకం పన్నాడు. గతంలో 2021లో ఒకసారి కారుతో యాక్సిడెంట్ చేసి చంపాలని, అలాగే నిమ్మికల్ ఫంక్షన్ హాల్ వద్ద మరోసారి చంపాలని ప్రయత్నించి విఫలమయ్యాడు.
పక్కా స్కెచ్‌తో తాళ్ళగడ్డలో ఇల్లు కిరాయి..
మధును చంపేందుకు జీవన్ పక్కా వ్యూహం రచించాడు. మధుకు స్నేహితులైన చింత సైదులు (A-2), మేదరి ప్రసాద్ (A-3)లకు డబ్బు ఎరజూపి తనవైపు తిప్పుకున్నాడు. మధును మట్టుబెట్టేందుకు సూర్యాపేట పట్టణ కేంద్రమైన తాళ్ళగడ్డలో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని, దానికి అయ్యే కిరాయి మరియు సైదులు ఖర్చులను జీవనే భరించాడు. ఈ విషయమై సైదులు భార్య భవానికి కూడా రూ. 3 లక్షలు ఇస్తానని ఒప్పించాడు. పథకం ప్రకారం.. ఈ నెల 22 (శుక్రవారం) మధ్యాహ్నం చేపలు, మద్యం తెచ్చామని, దావత్ చేసుకుందామని సైదులు, ప్రసాద్‌లు మధుకి ఫోన్ చేసి తాళ్ళగడ్డలోని కిరాయి ఇంటికి పిలిపించారు. మధు రాగానే జీవన్ (A-1) తన అనుచరుడు భరత్ (A-6) ద్వారా రెండు సార్లు మద్యం పంపించాడు. మధు పూర్తిగా మద్యం మత్తులోకి జారుకున్నాక, రాత్రి 7:30 గంటల సమయంలో జీవన్, ఆనంద్ (A-4)లు కారులో అక్కడికి చేరుకున్నారు. ఇంటి లోపలికి వెళ్లగానే ప్రసాద్ మధు కాళ్లు, చేతులు గట్టిగా పట్టుకోగా, సైదులు మటన్ కొట్టే కత్తితో మధుపై దాడి చేశాడు. వెంటనే జీవన్ ఆ కత్తిని అందుకుని మధు మెడ, ముఖం, భుజాలపై తీవ్రంగా నరికి దారుణంగా హత్య చేశాడు. అనంతరం శవాన్ని గోనెసంచిలో కట్టి కారులో తీసుకెళ్లి ఏర్కారం శివారు కల్వర్టు కింద పడేశారు. మధు బైక్‌ను బాలెంల సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద, హత్యకు వాడిన కత్తి, మధు సెల్ ఫోన్‌ను అడివేముల కెనాల్‌లో పారేశారు.
మిస్సింగ్ కేసు నుండి హంతకుల వేట వరకు..
శుక్రవారం ఉదయం ఇల్లు వదిలి వెళ్లిన మధు రాత్రి వరకు రాకపోవడంతో అతని భార్య మౌనిక పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మొదట మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు, శనివారం కల్వర్టు కింద శవం దొరకడంతో దానిని హత్యకేసుగా మార్చారు. ఎస్పీ ఆదేశాలతో డిఎస్పీ పర్యవేక్షణలో 5 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది.సోమవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో జాతీయ రహదారి 65 పై ఖమ్మం హైవే టి-జంక్షన్ వద్ద ప్రధాన నిందితుడు మిద్దె జీవన్, మిద్దె ఆనంద్‌లను అదుపులోకి తీసుకోగా అసలు విషయం వెలుగుచూసింది. వారి సమాచారం మేరకు ఉదయం 10 గంటల సమయంలో ఈనాడు ఆఫీస్ వద్ద మిగిలిన ముగ్గురు నిందితులు సైదులు, ప్రసాద్, భరత్‌లను అరెస్ట్ చేశారు. కాగా, A-5 నిందితురాలు ముల్కలపల్లి భవాని (సైదులు భార్య) ప్రస్తుతం పరారీలో ఉంది. కేసును 24 గంటల్లోనే ఛేదించి, ప్రతిభ కనబరిచిన సూర్యాపేట డివిజన్ డిఎస్పీ ప్రసన్నకుమార్, పట్టణ సిఐ వెంకటయ్య, రూరల్ సిఐ రాజశేఖర్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, ఎస్సైలు ఏడుకొండలు, శివతేజ, మహేందర్ నాథ్, బాలు నాయక్, టెక్నికల్ టీం, స్పెషల్ బ్రాంచ్ సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డులను ప్రకటించారు. ఈ సమావేశంలో డిఎస్పీ ప్రసన్న కుమార్, సిఐ వెంకటయ్య, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Read Also: బీజేపీది ఎన్నికల ముందొక మాట.. తర్వాత మరో మాట: పొంగులేటి
Read Also: ప్యాకేజ్డ్ బేబీ స్కామ్

