కలం, ఖమ్మం బ్యూరో : రాష్ట్రంలో దశాబ్దాలుగా వేధిస్తున్న రెవెన్యూ సమస్యలకు మరో ఏడాదిన్నరలో శాశ్వత పరిష్కారం చూపుతామని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Minister Ponguleti ) స్పష్టం చేశారు. కల్లూరులోని డీఎన్‌పీ ఫంక్షన్ హాల్‌లో గురువారం నిర్వహించిన ‘సత్తుపల్లి క్లస్టర్ ప్రజాదర్బార్’లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయితో కలిసి అర్జీదారుల నుంచి నేరుగా వినతులను స్వీకరించారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌లో జరిగిన అక్రమాలను వెలికితీసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పేదల భూములను కాజేయడం, అక్రమ బదిలీలు, భూముల మళ్లింపులపై సమగ్ర విచారణ కొనసాగుతోందని, తప్పు చేసిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన భూ రీ-సర్వేతో రికార్డులను ప్రక్షాళన చేసి, పేద రైతులకు వారి భూములపై పూర్తి హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
సత్తుపల్లి క్లస్టర్ ప్రజాదర్బార్‌కు అనూహ్య స్పందన లభించిందని, ఒక్క రోజే సుమారు 3,500 దరఖాస్తులు అందాయని మంత్రి వెల్లడించారు. వీటిలో 1,800 ఇందిరమ్మ ఇళ్లకు, 500 రెవెన్యూ సమస్యలకు, 200 పెన్షన్లకు సంబంధించినవి ఉన్నాయని చెప్పారు. గత ప్రభుత్వం రాష్ట్రంపై రూ.8.5 లక్షల కోట్ల అప్పుల భారం మోపినప్పటికీ, పేదల సంక్షేమంలో ఎలాంటి రాజీ పడేది లేదని తేల్చి చెప్పారు. అయితే, ఒకేసారి ఇళ్లు ఇస్తే ఆర్థిక భారం పెరుగుతుంది కాబట్టి, కులమతాలు, రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. ప్రజలందరూ ఆగస్టు 3 లోపు తమ ఎన్యూమరేషన్ ఫారాన్ని బీఎల్‌వోలకు అందజేసి ఓటు హక్కును పరిరక్షించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

