కలం, కరీంనగర్ బ్యూరో: గత మూడు రోజులుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విస్తారంగా వర్షాలు (Karimnagar Rains) కురుస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలు, నదుల వరద ప్రవాహాలు, జలాశయాల నీటిమట్టాల స్థితిగతులు క్రమంగా పెరిగాయి. గత రెండు రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షంతో వాగులు వంకలు పొంగి పడుతున్నాయి. జలాశయాలన్నీ జలకలను సంతరించుకున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
జగిత్యాల, పెద్దపల్లి, రామగుండం ప్రాంతంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా ముసురు వానలు పడుతున్నాయి. పెద్దపల్లి జిల్లా కూనారంలో అత్యధికంగా 132 మి.మీ. వర్షపాతం నమోదైంది. జగిత్యాల జిల్లా సారంగపూర్ 125.5 మి.మీ. అల్లీపూర్ లో 108.8 మి.మీ, పెద్దపల్లి జిల్లా ఇన్ క్లైన్ కాలనీ 108.5 మి.మీ, కరీంనగర్ జిల్లా గుండి లో 97.3 మి.మీ, అర్నకొండలో 74.8 మి.మీ, రాజన్న సిరిసిల్లా జిల్లా వట్టెంల 60.8 మి.మీ., బోయినపల్లి 50.5 మి.మీ ల వర్షం కురిసింది. కాగా జలాశయాల్లో జలకళ సంతరించుకుంది. ఎగువ నుంచి వరదతో ప్రాజెక్టుల్లో నీటి ప్రవాహం పెరుగుతోంది.
ఎల్లంపల్లి ప్రాజెక్టుకు పెరిగిన ఇన్‌ఫ్లో..
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో గురువారం ఉదయం 9 గంటల నాటికి ప్రాజెక్టులోకి 2.75 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదైంది. నీటిమట్టం 146.28 మీటర్లు, నీటి నిల్వ 17,445 TMC లుగా ఉంది. 20,1754 TMCల సామర్ద్యం ఉంది. నంది పంప్ హౌస్ కు 12,600 క్యూసెక్కులు, హెచ్ఎండబ్ల్యూఎస్ కు 275 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ ప్లో పెరుగుతుండడంతో గురువారం రాత్రి గేట్లు ఎత్తనున్నట్లు అధికారులు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు అనుబంధ లింక్-2 ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలోని నంది పంప్ హౌస్ ద్వారా గోదావరి జలాల ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి.
రాష్ట్ర నీటిపారుదల శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బుధవారం మధ్యాహ్నం నుంచి ఇక్కడి పంపు హౌస్ నుంచి నీటి ఎత్తిపోతల ప్రక్రియ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. గురువారం కూడా నీటి ఎత్తిపోతలు కొసాగాయి. 1,4,5,6 మోటార్ల ద్వారా నీటిని పంపింగ్ చేస్తున్నారు. ఒక్కో మోటార్ ద్వారా 3,150 క్యూసెక్కుల చొప్పున మొత్తం 4 మోటార్ల ద్వారా 12,600 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేసి నంది రిజర్వాయర్ లోకి ఎత్తిపోస్తున్నారు.
అనంతరం అదే పరిమాణంలో నంది రిజర్వాయర్ క్రష్ గేట్ల ద్వారా జలాలు ఏడో ప్యాకేజీ జంట సొరంగాల ద్వారా కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్ లోకి వెళ్తోంది. ఆ పంప్ హౌస్ లోని నాలుగు బహుబలి మోటార్లను ఆన్ చేసి అక్కడ నుంచి వరద కాలువ ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శ్రీ రాజరాజేశ్వర జలాశయానికి నీటిని తరలిస్తున్నారు.
మిడ్ మానేరు సామర్థ్యం ఎంతంటే..
రాజన్న సిరిసిల్లా జిల్లా బోయినపల్లి మండలంలోని మిడ్ మానేరులోకి గురువారం ఉదయం 6 గంటలకు సగటున 7,959 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. జలాశయం నీటిమట్టం 307.65 మీటర్లకు చేరింది. 27.55 టీఎంసీల సామర్థ్యానికి గాను ప్రస్తుతం 8.157 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అవుట్‌ఫ్లో 112 క్యూసెక్కులుగా ఉండి, స్పిల్ వే గేట్లు, రివర్ స్లూయిస్ గేట్లు తెరవలేదు. ఎగువ నుంచి క్రమంగా వరద ప్రవాహం ఉంది. గంభీరావుపేట మండలంలోని నర్మల ఎగువ మానేరు డ్యామ్‌లోకి 1,230 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ జలాశయంలో ప్రస్తుతం 0.727 టీఎంసీల నీటి నిల్వ ఉంది. దీంతో లోయర్ మానేరు డ్యాంకు ప్రవాహం పెరుగుతోంది.
ధర్మపురి వద్ద భారీగా వరద..
జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రం వద్ద గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. పుష్కర స్నానఘట్టాల వద్ద ప్రవాహం కొనసాగుతుండటంతో, అధికారులు నది పరివాహక ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లాలోని సబ్బితం జలపాతం వద్ద నీటిఉధృతి రికార్డు స్థాయిలో పెరగడంతో, సందర్శకుల భద్రత దృష్ట్యా పోలీసు శాఖ, గ్రామ పంచాయతీ తాత్కాలికంగా పర్యాటకుల ప్రవేశాన్ని నిలిపివేసాయి.
కోరుట్లలోని లోతట్టు ప్రాంత కాలనీలో ఇళ్ళ చుట్టు నీళ్ళు చేరాయి. జగిత్యాల మండలం అనంతారం, ధర్మపురి మండలం అక్షయపల్లి వద్ద జాతీయ రహదారి నీట మునగడంతో జగిత్యాల ధర్మపురి రూట్లో రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ఇబ్రహీంపట్నం మండలంలోని యమాపూర్ – ఫకీర్ కొండాపూర్ గ్రామాల మధ్య హై లేవెల్ వంతెన నిర్మాణం దశలో ఉండగా తాత్కాలిక రహదారి జలమయం కావడంతో రాక పోకలు నిలిచాయి. ఇబ్రహీంపట్నం-వర్షకోండ గ్రామల మధ్య ఉన్న లో కల్వర్టు పొంగిపొరలడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పలు గ్రామాల్లో వెళ్లే దారులపై చెట్లు విరిగిపోవడంతో పోలీసులు అప్రమత్తమై వాటిని తొలగించారు.
పెద్దపల్లిలో..
రామగుండం మున్సిపల్ పరిధిలోని 21వ డివిజన్ వీర్లపల్లి, ఓ.సి.పి – 3 ఏరియా, 25వ డివిజన్ వరద ప్రభావిత ప్రాంతాలను రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్, మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీతో కలిసి కలెక్టర్ కోయ శ్రీహర్ష క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరద పరిస్థితులను, నీటి నిల్వను, ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను పరిశీలించి అధికారులకు కలెక్టర్ తోపాటు ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద ప్రవాహాలు వచ్చే అవకాశం ఉన్నందున అన్ని శాఖల అధికారులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
విద్యాసంస్థలకు సెలవు..
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో కరీంనగర్ లో జనజీవనం స్తంభించిపోయింది. జలాశయాలకు జలకల సంతరించుకుంటున్నాయి. ముసురులా కురుస్తున్న వర్షం కారణంగా రేపు విద్యాసంస్థలకు జిల్లా కలెక్టర్ చిత్రామిశ్రా సెలవు ప్రకటించారు. రాబోయే ఆగస్టు రెండవ శనివారం పాఠశాలలు యధావిధిగా పని చేస్తాయని ప్రకటించారు. వర్షం వరదలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.
వాగును పరిశీలించిన కలెక్టర్ సత్య ప్రసాద్..
భారీ వర్షాల కారణంగా ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్–ఫకీర్ కొండాపూర్ గ్రామాల మధ్య ప్రవహిస్తున్న వాగును జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తో కలిసి పరిశీలించారు. వాగులో ప్రవాహ పరిస్థితులను పరిశీలించి ప్రజల భద్రతకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వర్షాల కారణంగా వాగుల ప్రవాహం ఎక్కువ ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు వాటిని దాటేందుకు ప్రయత్నించవద్దని సూచించారు.
ప్రమాదకర ప్రాంతాల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి, పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రజల ప్రాణాలకు ఎలాంటి ముప్పు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ కు వెంటనే సమాచారం అందించాలని కలెక్టర్ కోరారు.
తృటిలో తప్పిన ప్రమాదం
వాగుపై ఉన్న లో-లెవల్ బ్రిడ్జిపై ప్రవహిస్తున్న నీటిని దాటేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులు రెండు బైకులతో పాటు వాగులో పడిపోయారు. అయితే అక్కడే ఉన్న మాజీ సర్పంచ్ వన తడుపుల అంజయ్య, స్థానిక రైతులు, గ్రామస్తులు సాహసోపేతంగా స్పందించి ఇద్దరినీ, వారి బైకులను సురక్షితంగా బయటకు తీశారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కల్లూరు గ్రామ శివారులోని వాగుకు ఉద్ధృతంగా వరద ప్రవాహం కొనసాగుతోంది.
ఈ క్రమంలో కల్లూరు నుంచి రాయికల్ వైపు వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు రెండు బైకులపై లో-లెవల్ బ్రిడ్జిని దాటేందుకు ప్రయత్నించారు. నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో అదుపుతప్పి బైకులతో సహా వాగులో పడిపోయారు. స్థానికులు సమయస్ఫూర్తితో స్పందించడంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది.

