కాషాయ జెర్సీపై భారత హాకీలో కొత్త వివాదం

కలం, స్పోర్ట్స్: ప్రపంచకప్‌కు ముందు భారత హాకీ జట్టులో (India Hockey Team) కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ప్రధాన జెర్సీ రంగును సంప్రదాయ నీలం నుంచి కాషాయానికి మార్చడంపై మాజీ కెప్టెన్‌లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నెదర్లాండ్స్, బెల్జియంలో ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్న ప్రపంచకప్‌కు ముందు హాకీ ఇండియా పురుషులు, మహిళల జట్ల కొత్త కిట్‌ను విడుదల చేసింది. ఇందులో ప్రధాన జెర్సీగా కాషాయ రంగును (Saffron Hockey Jersey) ప్రవేశపెట్టడం చర్చనీయాంశమైంది.

ఈ నిర్ణయంపై స్పందించిన భారత మాజీ కెప్టెన్ ధనరాజ్ పిళ్లే, భారత హాకీకి నీలం జెర్సీయే అసలైన గుర్తింపు అని అన్నారు. కాషాయ రంగుపై తనకు గౌరవం ఉన్నప్పటికీ, అది భారత హాకీ సంప్రదాయ రంగు కాదని స్పష్టం చేశారు. 1928 ఒలింపిక్స్ జట్టు నుంచి ధ్యాన్‌చంద్, బల్బీర్ సింగ్, మహ్మద్ షాహిద్, జఫర్ ఇక్బాల్, 1980 ఒలింపిక్ స్వర్ణ పతక విజేతల వరకు అందరూ నీలం జెర్సీలోనే ఆడారని గుర్తు చేశారు. తాను కూడా తన కెరీర్ మొత్తం అదే జెర్సీ ధరించినట్లు తెలిపారు.

నీలం ఆస్ట్రో టర్ఫ్‌పై కనిపించకపోవడం వల్లే జెర్సీ రంగు మార్చాల్సి వచ్చిందన్న వాదనను కూడా ఆయన తోసిపుచ్చారు. ఇంతకాలం అలాంటి సమస్య ఎప్పుడూ తలెత్తలేదని పేర్కొన్నారు. మాజీ కెప్టెన్ పర్గత్ సింగ్ కూడా ఈ నిర్ణయాన్ని తప్పుబట్టారు. క్రీడలు రాజకీయాలు, మతం, కులాలకు అతీతంగా ఉండాలని వ్యాఖ్యానించారు. ఆటగాళ్లు, కోచ్‌ల సూచనలతోనే ఈ నిర్ణయం తీసుకున్నారనే వాదనపై కూడా సందేహం వ్యక్తం చేశారు. మాజీ కెప్టెన్ వీరెన్ రస్క్వినా కూడా జెర్సీ మార్పును వ్యతిరేకించారు. మరోవైపు, హాకీ ఇండియా మాత్రం కోచ్‌లు, ఆటగాళ్ల నుంచి వచ్చిన సాంకేతిక సూచనలతో పాటు జాతీయ జెండాలోని కాషాయ రంగు ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త జెర్సీని రూపొందించినట్లు వెల్లడించింది. ఈ మార్పుపై క్రీడా వర్గాలలో చర్చ కొనసాగుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>