కలం, మెదక్ బ్యూరో: పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా చైనా మంజా (Chinese Manja) విక్రయాలు, వినియోగం ఆగడం లేదు. ఇప్పటికే పలువురు చైనా మాంజా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా సంగారెడ్డి (Sangareddy) జిల్లా ఫసల్వాది గ్రామంలో చైనా మాంజా మరో ప్రాణాన్ని బలి తీసుకుంది. బైక్‌పై వెళ్తున్న వ్యక్తి మెడకు చైనా మాంజా బలంగా తాకడంతో గొంతు తెగి, తీవ్ర రక్తస్రావం జరిగి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన గురువారం చోటు చేసుకుంది.
మృతుడిని ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన అవిదేశ్ (35)గా పోలీసులు గుర్తించారు. కూలీ పనుల కోసం నిన్ననే ఉత్తర్ ప్రదేశ్ నుంచి సంగారెడ్డికి వచ్చిన అవిదేశ్, ద్విచక్రవాహనంపై రోడ్డుమీద ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా చైనా మాంజా మెడకు చుట్టుకుంది. దీంతో అతడి గొంతు తీవ్రంగా కోసుకుపోయి భారీగా రక్తస్రావం జరిగింది. స్థానికులు వెంటనే స్పందించినప్పటికీ, అప్పటికే అవిదేశ్ ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతికి కారణమైన చైనా మాంజాను (Chinese Manja) స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Also: ‘కోహ్లీ, గంభీర్ మధ్య గొడవ అదే’
Follow Us On: Sharechat


