కలం, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లోని చికెన్ ప్రియులకు గుడ్ న్యూస్. కొద్దిరోజులుగా పెరిగిన చికెన్ ధరలు (Chicken prices) భారీగా తగ్గాయి. గత వారంతో పోలిస్తే ఆదివారానికి చికెన్ ధరలు భారీగా దిగొచ్చాయి. హైదరాబాద్‌లో శనివారం వరకు కేజీ స్కిన్‌లెస్ చికెన్ రూ.370 నుండి రూ.380 పలకగా ఆదివారం రూ.270కి తగ్గి నాన్ వెజ్ ప్రియులకు ఊరటనిచ్చింది. అటు వరంగల్, కరీంనగర్ సిటీల్లోనూ ఇదే ధర ఉంది. ఏపీలోని ముఖ్యపట్టణాలైన విజయవాడలో కేజీ చికెన్ రూ.340, రాజమండ్రిలో రూ.300, అమలాపురంలో రూ.300-350 పలుకుతోంది. మార్చి నెల ప్రారంభంలో కిలో చికెన్ ధర గతంలో లేని విధంగా రూ.360 నుంచి 400 రూపాయల వరకు చేరింది. ఉష్ణోగ్రతలు పెరగటం, కోళ్లు చనిపోవడంతో కోళ్లు తగ్గి ధర పెరిగింది. గతవారం కేజీ చికెన్ ధర ఏకంగా రూ.400కు చేరి ఆల్ టైం హైయెస్ట్ గా నిలిచింది. ఇంత ధరకు చేరుకోవడంతో చికెన్ కొనుగోళ్లు కూడా బాగా తగ్గిపోయాయని వ్యాపారులు వాపోయారు. అయితే, వారం తర్వాత ఇవాళ కిలో చికెన్ ధర 100 రూపాయలు తగ్గింది. ఉష్ణోగ్రతలలో హెచ్చుతగ్గుల కారణంగా ఇలా చికెన్ ధరల్లో వ్యత్యాసాలు వస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇపుడు చికెన్ ధర తగ్గటంతో మళ్లీ అమ్మకాలు పెరిగే అవకాశాలు ఉంటాయంటున్నారు.
అటు ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో చికెన్ షాపులు బంద్ చేస్తామని తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ (Telangana Chicken Shop Owners Association) ప్రకటించింది. పౌల్ట్రీ కంపెనీలు తమకు ఇచ్చే లాభం (మార్జిన్) తగ్గించడంతో తాము తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నట్లు వ్యాపారులు తెలిపారు. ప్రస్తుతం చికెన్ విక్రయాలపై వస్తున్న లాభం చాలా తక్కువగా ఉండటంతో షాపులు నిర్వహించడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. మార్జిన్‌ను తక్షణమే పెంచాలని డిమాండ్ చేస్తూ, తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు నిరసన కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. ఈ నిర్ణయం వల్ల చికెన్ ప్రియులు ఇబ్బందులు పడే అవకాశముంది. ఎండాకాలంలో చికెన్‌కు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ధరలు మరింత పెరగవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

