epaper
Tuesday, November 18, 2025
epaper

మావోయిస్టుల కోటలో డీజీపీ కాన్ఫరెన్స్

కలం డెస్క్ : ప్రతి ఏటా జరిగే అన్ని రాష్ట్రాల డీజీపీ, ఐజీల సమావేశం (కాన్ఫరెన్స్) ఈసారి మావోయిస్టుల కోటలో జరగనున్నది. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి మావోయిజాన్ని అంతమొందిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించి ఇప్పటికే ఆ పార్టీ అగ్ర నాయకులను మట్టుబెట్టిన సందర్భంలో చత్తీస్‌గఢ్(Chhattisgarh) రాష్ట్ర రాజధాని నవ రాయపూర్‌లో ఈ సమావేశాన్ని నవంబరు 28-30 తేదీల మధ్య మూడు రోజుల పాటు జరగనున్నది.

వామపక్ష తీవ్రవాదం, వివిధ రాష్ట్రాల్లోని మిలిటెంట్ ఉద్యమాలు, దేశ అంతర్గత భద్రత, మాదకద్రవ్యాల కట్టడి, సైబర్ సెక్యూరిటీ, కౌంటర్ ఇంటెలిజెన్స్ తదితర పలు కీలక అంశాలపై ఈ కాన్ఫరెన్సులో చర్చించనున్నారు. అన్ని రాష్ట్రాల నుంచి సుమారు డీజీపీలు, ఐజీలు, మరో 200 మంది సీనియర్ పోలీసు అధికారులు పాల్గొనే ఈ కాన్ఫరెన్సును కేంద్ర హోం మంత్రి అమిత్ షా లాంఛనంగా నవంబరు 28న ప్రారంభించనున్నారు. ప్రధాని మోడీ ముగింపు కార్యక్రమానికి హాజరుకానున్నారు.

చత్తీస్‌గడ్ ఎంపిక వెనక వ్యూహం :

మావోయిస్టు పార్టీ నేతృత్వంలోని వామపక్ష తీవ్రవాదం దేశ అంతర్గత భద్రతకు పెను ప్రమాదంగా మారిందని ప్రధాని, కేంధ్ర హోం మంత్రి పలు సందర్భాల్లో వ్యాఖ్యానించడంతో పాటు గతేడాది నవంబరు చివరి వారంలో భువనేశ్వర్‌లో జరిగిన డీజీపీ, ఐజీల కాన్ఫరెన్సులో స్పష్టమైన కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. చత్తీస్‌గడ్ రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర పారా మిలిటరీ బలగాల సంయుక్త భాగస్వామ్యం, పరస్పర సహకారం సత్ఫలితాలు ఇచ్చిందని, మావోయిస్టు పార్టీ అగ్ర నేతలను ఒక్కరొక్కరుగా హతం కావడాన్ని ఈ సారి కాన్ఫరెన్సులో చర్చించి భవిష్యత్తులో చేపట్టనున్న వ్యూహం గురించి చర్చించనున్నారు. చత్తీస్‌గడ్ పోలీసు బలగాలు పైచేయి సాధించిన స్ఫూర్తిని పరిగణనలోకి తీసుకుని ఈసారి ఆ రాష్ట్రంలోనే డీజీపీ, ఐజీల కాన్ఫరెన్సును నిర్వహించాలని అమిత్ షా నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

వామపక్ష తీవ్రవాదమే ప్రధాన ఎజెండా :

గతేడాది తీసుకున్న నిర్ణయంలో భాగంగా మావోయిస్టు ఉద్యమాన్ని అణచివేయడం, ఆ పార్టీ హింసాత్మక కార్యకలాపాలను కట్టడి చేయడంలో ఆశించిన ఫలితాలు వచ్చినందున భవిష్యత్తులో తిరిగి తలెత్తకుండా అనుసరించాల్సిన వ్యూహం గురించి ఈ కాన్ఫరెన్సులో చర్చించనున్నారు. చత్తీస్‌గడ్ పోలీసులు అనుసరించిన వ్యూహాన్ని, సాధించిన విజయాలను లోతుగా సమీక్షించడంతో పాటు ఆ రాష్ట్ర పోలీసు అధికారుల చొరవను ప్రశంసించే అవకాశమున్నది. భవిష్యత్తులో ఇతర రాష్ట్రాల అధికారులు సైతం ఇదే తరహా వ్యూహాన్ని అనుసరించి విజయాన్ని సాధించాలని ఈ కాన్ఫరెన్సులో ప్రధాని, అమిత్ షా నొక్కి చెప్పే అవకాశమున్నది.

యూపీఏ హయాంలో ఢిల్లీలో మాత్రమే జరిగే ఈ సమావేశాలను ప్రధానిగా మోడీ బాధ్యతలు తీసుకున్న తర్వాత వివిధ రాష్ట్రాల్లో నిర్వహించే సంప్రదాయం మొదలైంది. జైపూర్ (రాజస్థాన్), కచ్ (గుజరాత్), లక్నో (ఉత్తరప్రదేశ్), గువాహటి (అసోం), హైదరాబాద్ (తెలంగాణ), గ్వాలియర్ (మధ్యప్రదేశ్), కేవర్‌గావ్ (గుజరాత్) తదితర రాష్ట్రాల్లో జరిగింది. ఇప్పుడు చత్తీస్‌గడ్ రాజధాని నవ రాయపూర్‌ను వేదికగా ఎంచుకోవడం వెనక మావోయిస్టు పార్టీకి గట్టి సందేశాన్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలన్న ఉద్దేశం స్పష్టమవుతున్నది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>