కలం, కరీంనగర్ బ్యూరో : మొహరం పర్వదినం త్యాగం, ధర్మనిరతి, సహనం సోదరభావానికి ప్రతీకగా నిలుస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) పేర్కొన్నారు. మొహమ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ మహోన్నత బలిదానాన్ని స్మరించుకుంటూ మొహరం జరుపుకుంటారని మంత్రి తెలిపారు. సత్యం, న్యాయం కోసం ఆయన చేసిన త్యాగం యావత్ మానవాళికి స్ఫూర్తిదాయకమని అన్నారు.
తెలంగాణలో మొహరం వేడుకలు కుల, మత భేదాలకు అతీతంగా నిర్వహించబడటం రాష్ట్ర ప్రత్యేకత అని మంత్రి పేర్కొన్నారు. తరతరాలుగా హిందూ ముస్లింలు కలిసి పీర్ల ఊరేగింపులు నిర్వహించడం తెలంగాణ గంగా-జమునా తెహజీబ్‌కు ప్రతీకగా నిలుస్తోందన్నారు. మొహరం పర్వదినం సమాజంలో ఐక్యత, సామరస్యం, పరస్పర గౌరవాన్ని పెంపొందించే సందర్భంగా నిలుస్తుందని, ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో మొహరం జరుపుకోవాలని మంత్రి కోరారు.

