కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల (Charla) మండల పరిసర ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న చర్ల ప్రభుత్వ ఆసుపత్రి గత ఆరు నెలల్లో 100 ట్యూబెక్టమీ శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించి మరో మైలురాయిని సాధించింది. గతంలో చర్ల ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్ లేకపోవడంతో ట్యూబెక్టమీ వంటి శస్త్రచికిత్సల కోసం రోగులు 56 కి.మీ దూరంలోని ఏరియా ఆసుపత్రి భద్రాచలం వరకు వెళ్లాల్సి వచ్చేది. దీంతో రోగులపై ఆర్థిక భారం, శారీరక ఇబ్బందులు అధికంగా ఉండేవి. ప్రస్తుతం సిజేరియన్ వంటి ప్రధాన శస్త్రచికిత్సలతోపాటు అత్యాధునిక టిఫా స్కానింగ్ సేవలు కూడా అందుబాటులోకి రావడం గమనార్హం.
భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే డా. తెల్లం వెంకట్రావు సూచన మేరకు అప్పటి జిల్లా కలెక్టర్ జితేశ్ పాటిల్ ప్రత్యేక దృష్టి సారించి ఆరు నెలల క్రితం చర్ల ఆసుపత్రిలో నూతన ఆపరేషన్ థియేటర్‌ను ఏర్పాటు చేసి అవసరమైన పరికరాలు సమకూర్చారు. అలాగే మాతృ సేవలకు అవసరమైన ప్రసూతి, పిల్లల, మత్తు వైద్య నిపుణులను నియమించారు. దీంతో స్థానికంగా అన్ని వైద్య సేవలు అందుబాటులోకి వచ్చి గిరిజన ప్రాంతాల ప్రజలకు పెద్ద ఊరట లభించింది.
జిల్లా కలెక్టర్ అంకిత్ ప్రత్యేక దృష్టి..
ప్రస్తుతం జిల్లా కలెక్టర్ అంకిత్ చర్ల ఆసుపత్రిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇటీవలే ఒక రేడియాలజిస్ట్ వైద్య నిపుణురాలిని నియమించారు. అలాగే అత్యవసర సేవలు నిరంతరంగా అందుబాటులో ఉండేలా ముగ్గురు ఎంబీబీఎస్ వైద్యులు, ముగ్గురు శానిటేషన్ సిబ్బందిని కూడా నియమించడం జరిగింది.
మరింత విస్తృత సేవల దిశగా కృషి: డీసీహెచ్ఎస్ డా. రవి బాబు
జిల్లా కలెక్టర్ అంకిత్ నేతృత్వంలో భద్రాచలం శాసనసభ్యులు డా. తెల్లం వెంకట్రావు మద్దతుతో మరింత విస్తృత వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాము. ఇప్పటికే 100 ట్యూబెక్టమీ శస్త్రచికిత్సల మైలురాయినీ చేరుకున్నాము. ఈ విజయంలో చర్ల ఆసుపత్రి వైద్య బృందం డా. కె. శ్రావణి, డా. కె. శివ రామకృష్ణ ప్రసాద్ ఆపరేషన్ థియేటర్ సిబ్బంది భాగస్వామ్యం కూడా మరువలేనిది. అలాగే ఆసుపత్రికి సంబంధించిన మౌలిక సదుపాయాలు, సిబ్బంది నియామకం వంటి విషయాలలో అవసరమైన మద్దతు అందించిన జిల్లా కలెక్టర్ అంకిత్ సర్ కు, అలాగే ఓపీ గదుల ఏర్పాటు, పరికరాలు మంజూరు చేసిన ఐటిడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ రాహుల్ సర్ కు ప్రత్యేక ధన్యవాదాలు. చర్లలో నిర్మాణంలో ఉన్న 30 పడకల నూతన భవనం పూర్తయిన తర్వాత మరింత మెరుగైన వైద్య సేవలు అందించగలమనే విశ్వాసం ఉంది.
కే. నాగలక్ష్మి, చర్ల మండలం
“చర్ల ఆసుపత్రిలో గతంలో కంటే సేవలు మెరుగయ్యాయి. గతంలో ప్రతి చిన్న అవసరానికీ భద్రాచలం వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది, ఇప్పుడు ఆ అవసరం లేకపోవడం సంతోషంగా ఉంది. ముఖ్యంగా గర్భిణి మహిళలకు చర్ల ఆసుపత్రి ఎంతో అనుకూలంగా మారింది, దీంతో ఆర్థిక భారం మాత్రమే కాకుండా ప్రయాణ ఇబ్బందులు కూడా గణనీయంగా తగ్గాయి.” అని చెప్పారు.

