కలం మెదక్ బ్యూరో: అదో మారుమూల తండా.. బాహ్య ప్రపంచానికి దూరంగా విసిరేసినట్టుగా ఉండే ప్రాంతం. కనీస వసతులు అంతంత మాత్రమే. అయితేనేం అభివృద్ధిలో మాత్రం నెంబర్ వన్. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉత్తమ పంచాయతీగా ప్రకటించింది. అదే సంగారెడ్డి జిల్లా విట్టునాయక్ తండా (Vittu Nayak Thanda). తొమ్మిది అంశాల్లో రాష్ట్రంలోని మిగతా గ్రామపంచాయతీలతో పోటీపడుతూ ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకుంది. దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించి అభివృద్ధిలో దూసుకుపోతోంది ఈ తండా.
ఉత్తమ పంచాయతీగా..
సంగారెడ్డి జిల్లా మొగడంపల్లి మండలం విట్టునాయిక తండా. తెలంగాణ-కర్ణాటక సరిహద్దులో మారుమూల గ్రామపంచాయతీ. రాష్ట్రంలో అత్యుత్తమ గ్రామపంచాయతీగా నిలిచింది. విట్టునాయిక్ తండాలో 1944 మంది నివాసం ఉంటారు. ఇందులో 950 మహిళలు ఉండగా, 944 మంది పురుషులు ఉన్నారు. విట్టునాయక్ తండా శివారు భూములు కర్ణాటక రాష్ట్రంలో కలిసి ఉంటాయి. సాధారణంగా సరిహద్దు ప్రాంతాలంటే అభివృద్ధికి అమడదూరంలో ఉంటాయి. కానీ విట్టునాయక్ తండాలో జరిగిన అభివృద్ధిని చూసి కేంద్ర పంచాయతీ రాజ్, గ్రామీణభివృద్ధి మంత్రిత్వ శాఖ ఉత్తమ పంచాయతీగా ఎంపిక చేసింది. 2023 -2024 అర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ప్రభుత్వ (Central Govt) అవార్డును సాధించింది. జాతీయ పంచాయతీ దినోత్సవం సందర్భంగా కేంద్రం ఉత్తమ గ్రామపంచాయతీగా ఎంపిక చేస్తుంది. రాష్ట్రంలోని 553 మండలాల్లోని 12566 గ్రామపంచాయతీల పనితీరును పరిశీలించి విట్టునాయక్ తండాను ఉత్తమ పంచాయతీగా ప్రకటించింది. పేదరికం, ఆరోగ్యం, మౌలిక వసతులు, సుపరిపాలన, మహిళ సాధికరత.. లాంటి అంశాల ఆధారంగా ఎంపికైంది.
ఎలా సాధ్యమైందంటే?
ఓ మారుమూల తండా జాతీయ అవార్డును (National Award) గెల్చుకోవడం అంతా ఈజీ కాదు. కానీ విట్టునాయక్ (Vittu Nayak Thanda) తండావాసులు సమిష్టి లక్ష్యంతో అభివృద్ధి చేసుకున్నారు. నిత్యం గ్రామసభలు నిర్వహిస్తూ తండా సమస్యల పరిష్కారం కోసం ప్రణాళికలను అమలు చేశారు. గ్రామంలో రోడ్లు, సురక్షిత తాగునీరు, లైట్లు, డ్రైనేజీ లాంటి మౌలిక వసతులు ఏర్పడ్డాయి. అలాగే ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ.. రెగ్యూలర్‌గా మెడికల్ క్యాంపులను నిర్వహించారు. శానిటేషన్‌ను పక్కాగా అమలుచేశారు. అశా వర్కర్లు, అంగన్ వాడీ టీచర్ల సాయంతో ప్రభుత్వ పథకాలను వందశాతం అమలు చేశారు. తండా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే మహిళల అభివృద్ధి కోసం స్వయం సహయక గ్రూపులు పనిచేశాయి. ముఖ్యంగా తండాలో జరిగే ప్రతి ప్రభుత్వ కార్యక్రమం, పథకాలు, ఇతర పనులను డిజిటలైజేషన్ చేశారు. గ్రామ పరిపాలనలో పారదర్శకత కోసం రికార్డులను ఈ-గవర్నెస్ ద్వారా పక్కాగా అమలు చేశారు.
అందరి సహకారంతోనే..
కేంద్ర ప్రభుత్వ అవార్డు తమ పంచాయతీకి రావడం గర్వకారణంగా ఉందని తండావాసులు హర్షం వ్యక్తం చేశారు. మూరుమూల తండాలో జరిగిన అభివృద్ధి ఆధారంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఏ కార్యక్రమం చేపట్టినా బాధ్యతగా భావించి చేశామన్నారు. గ్రామ సర్పంచ్ జాదవ్ చందు, పంచాయతీ సెక్రటరీ సందీప్‌లు మాట్లాడుతూ.. ఈ అవార్డు తమ తండాకు ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చిందని, అందరి సహకారంతో ఇది సాధ్యమైందన్నారు.
Read Also: నాన్నకు ప్రేమతో.. తండ్రి ‘కల’ నెరవేర్చిన కొడుకు ‘కలం’..!
Follow Us On: Instagram

