కలం, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మరోసారి దాడులు నిర్వహించారు. ఓ కేసు దర్యాప్తు చేసి చార్జ్ షీట్ దాఖలు చేయడానికి ఏకంగా రూ.1.05 లక్షలు లంచం డిమాండ్ చేసిన చందానగర్ ఎస్సై (Chandanagar SI), కానిస్టేబుల్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
చందానగర్‌లో శనివారం ఏసీబీ అధికారులు జరిపిన దాడిలో చందానగర్ స్టేషన్‌లో పని చేస్తున్న ఎస్సై బండేల బలరాజ్ ఒక కేసు దర్యాప్తు నిమిత్తం చార్జ్ షీట్ దాఖలు చేసేందుకు బాధితుడి నుంచి రూ.75 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎస్సై ఇప్పటికే రూ.20 వేలు ముందస్తుగా తీసుకున్నారు. మరోవైపు కానిస్టేబుల్ రాఘవేంద్ర యూపీఐ ద్వారా మరో రూ.10 వేలు తన ఖాతాలోకి పంపించుకున్నారు. మొత్తం లంచం రూ.1.05 లక్షలు డిమాండ్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఇద్దరిపై చట్టపరంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

