కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగరంలో ఒక అండర్ ట్రయల్ ఖైదీ సినిమా ఫక్కీలో పోలీసుల కళ్లు గప్పి పారిపోయిన (Prisoner Escape) ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక దొంగతనం కేసులో సయ్యద్ అమీర్ హుస్సేన్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు అతడిని చంచల్‌గూడ కేంద్ర కర్మాగారానికి తరలించారు. అయితే ఎలాగైనా జైలు నుంచి తప్పించుకోవాలని గట్టి ప్లాన్ వేసిన అమీర్.. అనూహ్యంగా మేకులు మింగేశాడు. కడుపులో తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న ఖైదీని చూసి కంగారుపడిన జైలు అధికారులు, తక్షణ చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
వైద్యులు అతడికి అత్యవసర వార్డులో చికిత్స అందిస్తున్న సమయంలో, అమీర్ సమయం కోసం వేచి చూశాడు. అక్కడ ఉన్న వైద్య సిబ్బంది, రక్షణగా వచ్చిన పోలీసుల కళ్లు గప్పి ఆసుపత్రి నుంచి క్షణాల్లో మాయమయ్యాడు. ఖైదీ కనిపించకపోవడంతో షాక్‌కు గురైన హాస్పిటల్ అధికారులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.
సంచలనం సృష్టించిన ఈ పరారీ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించారు. అత్యంత భద్రత ఉండే అండర్ ట్రయల్ ఖైదీ ఇంత సులువుగా ఎలా పారిపోయాడనే కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు. అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇది జరిగిందా అనే అనుమానాలతో అధికారులు ప్రస్తుతం అంతర్గత విచారణ జరుపుతున్నారు. పారిపోయిన నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

