కలం, వెబ్ డెస్క్: బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై (Tejasvi Surya) కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తేజస్వి వ్యాఖ్యలు తెలంగాణ అస్థిత్వాన్ని, 1600 మంది అమరవీరుల త్యాగాలను అవహేళన చేసేలా ఉన్నాయని ఫైర్ అయ్యారు. తెలంగాణ ఏర్పాటుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని రాజకీయ పార్టీలు అంగీకరించాయని గుర్తు చేశారు. అలాంటి చారిత్రక అంశంపై తేజస్వి కనీస అవగాహన లేకుండా మాట్లాడారని విమర్శించారు. కేవలం తన పార్టీ అగ్ర నాయకత్వాన్ని ప్రసన్నం చేసుకోవడానికే ఆయన ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మహిళా రిజర్వేషన్ల బిల్లును (Women Reservation Bill) కాంగ్రెస్ ఎన్నడూ వ్యతిరేకించలేదని స్పష్టం చేశారు. 2023లో బిల్లు పాస్ చేసి.. 2027 జనాభా లెక్కల తర్వాతే అమలు చేస్తామని చెప్పడం బీజేపీ ఆడుతున్న నాటకం కాదా? అని ప్రశ్నించారు. రిజర్వేషన్ల పేరుతో బీజేపీ రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు బీజేపీ తీవ్ర అన్యాయం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ అవసరాల కోసమే ఈ ప్రక్రియను వాడుకుంటున్నారని విమర్శించారు. డీలిమిటేషన్ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన ‘హైబ్రిడ్ మోడల్’ సరైనదని సమర్థించారు. 50 శాతం సీట్లు ప్రోరేటా ప్రకారం.. మిగిలిన 50 శాతం సీట్లు రాష్ట్రాల ఆర్థికవృద్ధి రేటు ఆధారంగా పెంచాలన్న సీఎం ప్రతిపాదన శాస్త్రీయమైనదని, దీన్ని రాజ్యాంగ విరుద్ధమని చెప్పి తప్పించుకోవాలని బీజేపీ చూస్తోందన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి అవసరమైనప్పుడు ఎన్నో సవరణలు జరిగాయని, దేశ ప్రయోజనాల దృష్ట్యా ఇది కూడా సాధ్యమేనని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసిన తేజస్వి సూర్య వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ ఎంపీలు ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. తక్షణమే తెలంగాణ బీజేపీ ఎంపీలు రాష్ట్ర ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని చామల (Chamala Kiran Kumar Reddy) డిమాండ్ చేశారు.
Read Also: ఆత్మరక్షణలో బీజేపీ.. జీహెచ్ఎంసీలో నెగెటివ్ ఎఫెక్ట్..
Follow Us On: Instagram

