కలం, కరీంనగర్ బ్యూరో : కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వీబీ జీ రామ్ జీ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని సీపీఐ మాజీ ఎమ్మెల్యే, మాజీ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి ( Chada Venkat Reddy ) డిమాండ్ చేశారు. శనివారం సీపీఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా పెద్దపల్లి కేంద్రంలోని జూనియర్ కళాశాల గ్రౌండ్ నుండి కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చాడ మాట్లాడుతూ, భారత గడ్డపై సీపీఐ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ముగింపు బహిరంగ సభ జనవరి 18న ఖమ్మంలో సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
భారతదేశంలో జరిగే అనేక పోరాటాలకు సీపీఐ నాయకత్వం వహించిందని నాటి స్వతంత్ర పోరాటం నుండి నేటి వరకు ప్రతి పోరాటంలో కమ్యూనిస్టు పార్టీ పాత్ర ప్రధానంగా ఉందని ఆయన అన్నారు. మూడోసారి గెలిచిన బిజెపి ప్రభుత్వం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం లేకుండా చేయాలనే కుట్రలు పన్నుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఆపరేషన్ కగార్ పేరుతో దుర్మార్గంగా నక్సల్స్ ను ఎన్ కౌంటర్ చేస్తూ ఆదివాసీలను సైతం అతి క్రూరంగా చంపుతున్నారని అన్నారు.
ఫలానా తేదీ వరకు దేశంలో ఒక్క మావోయిస్టు కూడా లేకుండా చేస్తామని, అనంతరం అర్బన్ నక్సల్స్ అంతం కూడా చేస్తామని బహిరంగంగా ప్రకటించడం అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లు అవుతుందని చాడ అన్నారు. కమ్యూనిస్టు పార్టీకి గత వైభవం తీసుకురావడానికి శతాబ్ది ఉత్సవాల వేదికగా జిల్లాలో ఘనంగా ఏర్పాటు చేయడంతో పాటు ఈనెల 18న ఖమ్మం లో జరిగే సభకు వేలాదిగా తరలిరావాలని చాడ (Chada Venkat Reddy) పిలుపునిచ్చారు.
Read Also : అజిత్ దోవల్ అసలు ఫోన్ వాడరట!
Follow Us On : Twitter


