కలం, వెబ్ డెస్క్: పెట్రోల్ విడిగా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. పెట్రోల్, డిజిల్ అమ్మకాలకు సంబంధించి మార్గదర్శకాలు (Guidelines for Fuel) జారీ చేసింది. పశ్చిమాసియా యుద్ధం ప్రభావంతో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడొచ్చనే వార్తలు వస్తున్నాయి. దీంతో దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వాహనదారులు బంకులకు చేరుకొని భారీగా పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేస్తున్నారు. కొన్ని చోట్ల కంటైనర్లలోనూ పెట్రోల్, డీజిల్ తీసుకెళ్తున్నారు. దీంతో ఆయా బంకుల్లో రద్దీ విపరీతంగా పెరుగుతోంది. తమిళనాడులో ఓ వ్యక్తి ఏకంగా విడి కంటైనర్‌లో పెట్రోల్ నింపుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
కంటైనర్లలో విక్రయించొద్దు
పెట్రోల్, డీజిల్‌ను ఎట్టి పరిస్థితుల్లో విడి కంటైనర్లలో విక్రయించవద్దని పెట్రోల్ బంకులను హెచ్చరిస్తూ చమురు మంత్రిత్వశాఖ ఓ అడ్వైజరీని జారీ చేసింది. పెట్రోల్, డీజిల్‌ను కంటైనర్లలో నిల్వ చేయవద్దని పౌరులకు సూచించింది. ఇటువంటి చర్యలు భద్రతకు ముప్పు కలిగిస్తాయని తెలిపింది. ఈ మేరకు తమిళనాడులోని ఒక రిటైల్ అవుట్‌లెట్‌లో పెట్రోల్‌ను విడి కంటైనర్‌లో విక్రయించడాన్ని తాము గమనించామని.. ఇదే ఏమాత్రం సురక్షితం కాదని పేర్కొన్నది. విడి కంటైనర్‌లో విక్రయించిన సదరు పెట్రోల్ బంక్ అనుమతిని తాత్కాలికంగా రద్దు చేసినట్టు చమురు మంత్రిత్వశాఖ తెలిపింది.
మార్గదర్శకాలు పాటించాల్సిందే
ఇంధనం విక్రయించేటప్పుడు భద్రతా మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని చమురు రిటైలర్లు, డీలర్లను ఆదేశించింది. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. పెట్రోల్, డీజిల్ కొరతపై వాహనదారులు సందేహ పడాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ నిల్వలు దేశంలో తగినంత పరిణామంలో ఉన్నాయని .. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. హైరానా చెంది పెట్రోల్, డీజిల్‌ను నిల్వచేయొద్దని సూచించింది.

