కేంద్రమంత్రి శివరాజ్ సింగ్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

కలం, వెబ్ డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను (Shivraj Singh Chouhan) సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై కేంద్రమంత్రితో చర్చలు జరిపారు.

ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY-G 2.0) కింద తెలంగాణకు అత్యవసరంగా 11.56 లక్షల ఇండ్లు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) కేంద్ర మంత్రిని కోరారు. గత ప్ర‌భుత్వ హ‌యాంలో తెలంగాణలో గ్రామీణ ఇళ్ల నిర్మాణం తీవ్రంగా నిర్లక్ష్యానికి గురైందని, దీనివల్ల నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నారని కేంద్రమంత్రికి తెలియజేశారు.

అలాగే, ప్రస్తుత ఎల్‌నినో (El Nino) పరిస్థితుల దృష్ట్యా గ్రామీణాభివృద్ధికి సంబంధించి మరో కీలక విజ్ఞప్తి చేశారు. ‘వీబీ-జీ రామ్-జీ’ పథకంలో అదనపు పనులను చేర్చాలని ఆయన కోరారు. రైతుల జీవనోపాధిని మెరుగుపరచడంతో పాటు వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు మరో 10 కొత్త పనులను ఈ జాబితాలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రతిపాదనలో భాగంగా కూరగాయల పందిళ్లు, పశుగ్రాస ప్లాట్లు, మల్బరీ తోటలు, అలాగే పట్టు పురుగుల పెంపక షెడ్ల నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేయాలని కోరారు. అంతేకాకుండా, రైతుల భూముల అభివృద్ధి, నీటి సంరక్షణ చర్యలు చేపట్టడంతో పాటు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా దెబ్బతిన్న భూములను తిరిగి పునరుద్ధరించే పనులకు ఈ పథకంలో అవకాశం కల్పించాలన్నారు.

ఈ క్రమంలోనే తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను కూడా వీబీ-జీ రామ్-జీ జాబితాలో చేర్చాలని కేంద్రమంత్రిని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. దీనిద్వారా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు ఉపాధి హామీ పథకం కింద 90 రోజుల పాటు పని కల్పించి ఆర్థికంగా అండగా నిలవాలన్నారు. సీఎం అభ్యర్థనలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం అందుతోంది.

Read Also: కేంద్రంపై యువతలో తీవ్ర వ్యతిరేకత: కేటీఆర్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>