కలం, వెబ్ డెస్క్: రష్యా ఆర్మీ (Russian Army)లోకి వెళ్తున్న భారతీయులను కేంద్ర ప్రభుత్వం గట్టిగా హెచ్చరించింది. అనుమతి లేని ఏజెంట్ల మాటలు నమ్మి.. ఆ దేశానికి వెళ్లొద్దని సూచించింది. తెలంగాణకు చెందిన భుక్యా రవీందర్, భుక్యా అశోక్, మెగావత్ ప్రకాశ్, మహ్మద్ అఫ్జల్ ఖాన్.. ఫిబ్రవరి నెలలో రష్యాకు వెళ్లారు. జాబ్ ఆశ చూపించి తమను మోసం చేసి, రష్మా ఆర్మీలో చేర్చుకున్నారని కాపాడాలని కేంద్ర ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో కోరుతూ వీడియోలు విడుదల చేస్తున్నారు. ఇవి కాస్తా వైరల్ అవుతుండటంతో కేంద్ర విదేశాంగ శాఖ స్పందించింది. నెలకు రూ.2 లక్షలు వస్తాయనే ఆశతో వెళితే.. ప్రాణాలకే ప్రమాదమని పేర్కొంది. కొందరు ఈ విషయం తెలిసినా.. ప్రాణాలను రిస్క్ చేసి మరీ జాయిన్ అవుతున్నట్లు తెలిపింది. తాత్కాలిక ప్రయోజనాలు ఆశించి నిర్ణయాలు తీసుకోవద్దని పేర్కొంది.
పౌరసత్వాన్ని వదులుకుని మరీ..
రష్యా ఆర్మీలో చేరేందుకు కొందరు భారత పౌరసత్వాన్ని (Indian Citizenship) కూడా వదులుకుంటున్నారని కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తాత్కాలిక ఆర్థిక ప్రయోజనాల కోసం.. ఏజెంట్లు ఇచ్చే ఆఫర్లకు అంగీకరించి.. అధికారులను సంప్రదించకుండానే వెళ్లిపోతున్నారని పేర్కొంది. ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ వద్ద నమోదు కాని ఏజెంట్లను నమ్మొద్దని సూచించింది. ఇప్పటికే రష్యా సైన్యంలో (Russian Army) చేరిన భారతీయులను విడుదల చేయించేందుకు భారత్-రష్యా మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఆగస్టు చివరి నాటికి 227 మంది భారతీయులు రష్యా సైన్యంలో చేరగా.. 139 మంది సురక్షితంగా వెనక్కి వచ్చారు. 51 మంది యుద్ధంలో మరణించినట్లు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
Also Read : ప్రాణాలకు తెగించి.. 174 మందిని కాపాడిన ఇండియన్ పైలట్!
Follow Us On: X(Twitter)

