కలం, వెబ్ డెస్క్ : ఊహించన ప్రమాదంలో చాకచక్యంగా వ్యవహరించి 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ (Smit Machchhar) ప్రస్తుతం ఆస్పత్రిలో గాయాలతో చికిత్స పొందుతున్నారు. విమానం నడుపుతున్న సమయంలో ఒమన్‌కు చెందిన కో-పైలట్ దాడి చేయడంతో మచ్చర్‌కు మెడ, కడుపు, ముఖంపై దాదాపు 10 కత్తిపోట్లు పడ్డాయి. విపరీతంగా రక్తం ఓడుతున్నప్పటికీ, ఆయన ధైర్యంతో కాక్‌పిట్ తలుపులను తెరిచారు. దీనివల్ల విమాన సిబ్బంది, ప్రయాణికులు వెంటనే స్పందించి పెద్ద ప్రమాదాన్ని అడ్డుకోగలిగారు.
ప్రస్తుతం సౌదీ అరేబియాలోని తబుక్ ఆస్పత్రి ఐసీయూలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే వైద్యులు పలు కీలక శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నప్పటికీ, పూర్తిగా కోలుకోవడానికి మరికొన్ని రోజులు పడుతుందని వైద్య బృందం వెల్లడించింది. భారత అధికారులు మచ్చర్ కుటుంబ సభ్యులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. ఇదే ఆస్పత్రిలో దాడికి పాల్పడిన కో-పైలట్‌కు కూడా చికిత్స అందిస్తున్నారు. సకాలంలో స్పందించి అందరి ప్రాణాలను కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్యసాహసాలపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
గ్లోబల్ లీడర్ల ప్రశంసలు
విమానంలో తీవ్ర గాయాలైనప్పటికీ ధైర్య సాహసాలు ప్రదర్శించి 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై ప్రపంచ నాయకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయనను రియల్ హీరోగా కొనియాడారు.
ప్రాణాపాయ స్థితిలోనూ స్మిత్ చూపిన అసాధారణ ధైర్యం, తెగువ ఎంతోమంది జీవితాలను నిలబెట్టిందని, ఆయన సమయస్ఫూర్తి వల్లనే ఒక పెద్ద ప్రమాదం తప్పిందని పిఎం మోడీ పేర్కొన్నారు. భారత్ ఆయనను చూసి గర్విస్తోందని చెబుతూ, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, డొనాల్డ్ ట్రంప్ కూడా స్మిత్ మచ్చర్ సమయానికి కాక్‌పిట్ తలుపులు తెరవడం వల్లే విమానం సురక్షితంగా బయటపడిందని, ఆయన నిజమైన వీరుడని కొనియాడారు.

