కలం, వెబ్డెస్క్: భారత ప్రథమ ప్రధాన మంత్రి నెహ్రూకు సంబంధించిన విలువైన పేపర్లు, పత్రాలు (Nehru Papers) ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రరీ(పీఎంఎంఎల్)లో కనిపించడం లేదని వచ్చిన వార్తలపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. ఆ పేపర్లు సోనియా గాంధీ వద్దే ఉన్నాయని కేంద్ర సాంస్కృతిక శాఖ బుధవారం ‘ఎక్స్’ వేదికగా వెల్లడించింది. అంతేకాదు, అవి దేశ వారసత్వ సంపదలో భాగమని, వాటిని తిరిగివ్వాలని కోరింది. కాగా, లోక్సభలో బీజేపీ ఎంపీ సంబితా పాత్ర అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సమాధానమిస్తూ నెహ్రూకు సంబంధించిన విలువైన పేపర్లు, పత్రాలు పీఎంఎంఎల్లో లేవని, అవి సోనియా వద్ద ఉన్నాయని చెప్పడం కాంగ్రెస్ సభ్యుల ఆగ్రహానికి గురైంది. దీనిపై సోనియా గాంధీకి బీజేపీ క్షమాపణ చెప్పాలని వాళ్లు డిమాండ్ చేశారు. ఈ గొడవ నేపథ్యంలో కేంద్ర సాంస్కృతిక శాఖ క్లారిటీ ఇచ్చింది. పీఎంఎంఎల్లోని నెహ్రూ పేపర్స్ 2008లో సోనియా గాంధీ ప్రతినిధి ఎంవీ రజన్ తీసుకున్నారని, ఆ తర్వాత నుంచి అవి ఆమె వద్దనే ఉన్నాయని వెల్లడించింది. ఆ పత్రాలు దేశ విలువైన ఆస్తిలో భాగమైనందున వాటిని తిరిగి ఇవ్వాలని తాము పలుసార్లు లేఖలు రాశామని, ఈ ఏడాది జనవరి, జులైలోనూ లేఖలు పంపామని వెల్లడించింది.


