కలం, కరీంనగర్ బ్యూరో: అమాయక ప్రజలను, ముఖ్యంగా వృద్ధులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న అంతర్‌జిల్లా దొంగల ముఠాను (Inter-District Theft Gang) కోరుట్ల (Korutla) పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి బంగారు గొలుసు, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలీసులు కేసు వివరాలను వెల్లడించారు. అరెస్ట్ అయిన నిందితులు సిద్దిపేట జిల్లా ప్రశాంత్‌నగర్‌కు చెందిన అల్లెపు కృష్ణ (51), కుంచెపు శ్రీకాంత్ (30), అల్లెపు రాజ్‌కుమార్ (28)గా పోలీసులు గుర్తించారు.
పోలీసుల వివరాల ప్రకారం, సిద్దిపేట ప్రాంతంలో తమ నేరచరిత్ర బయటపడే అవకాశం ఉండటంతో ఈ ముఠా ఇతర ప్రాంతాలలో దొంగతనాలకు పాల్పడాలని యోచించింది. ఈ నెల 15న కోరుట్లకు చేరుకున్న నిందితులు ఓ లాడ్జిలో బస చేసి, మరుసటి రోజు బస్టాండ్ సమీపంలో సుమారు 70 ఏళ్ల వృద్ధురాలిని లక్ష్యంగా చేసుకున్నారు. ప్రభుత్వ పెన్షన్‌ను రూ.2,000 నుంచి రూ.4,000కు పెంచిస్తామని నమ్మించి ఆమెను ఎస్‌బీఐ బ్యాంకు సమీపానికి తీసుకెళ్లారు. బంగారు ఆభరణాలు ధరించి ఉంటే పెన్షన్ మంజూరు కాదని మాయమాటలు చెప్పి మెడలో ఉన్న లక్ష్మీదేవి బిళ్లల బంగారు గొలుసును తీయించుకున్నారు. అనంతరం పెన్షన్ ఫారాలు తీసుకొస్తామని చెప్పి గొలుసుతో పరారయ్యారు.
మరిన్ని దొంగతనాలకు యత్నిస్తున్న సమయంలో లభించిన పక్కా సమాచారంతో కోరుట్ల పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 24 గ్రాముల బరువున్న బంగారు గొలుసుతో పాటు ఒక రియల్‌మీ, ఒక శాంసంగ్ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ప్రధాన నిందితుడు అల్లెపు కృష్ణపై గతంలో వివిధ పోలీస్ స్టేషన్‌లలో 100కు పైగా కేసులు నమోదై ఉన్నట్లు తేలింది. మిగతా ఇద్దరు నిందితులపై కూడా పలు దొంగతనాల కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు.
ప్రజలకు పోలీసుల సూచనలు
ప్రభుత్వ పథకాలు, పెన్షన్ పెంపు, బ్యాంకు సేవలు లేదా ఇతర హామీల పేరుతో అపరిచితులు సంప్రదిస్తే అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఎట్టి పరిస్థితులలోనూ విలువైన బంగారు ఆభరణాలను అపరిచితులకు ఇవ్వొద్దని హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 112 కు సమాచారం ఇవ్వాలని కోరుట్ల పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

