కలం, వెబ్ డెస్క్ : న్యూఢిల్లీ వేదికగా దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ (Assembly Seats) స్థానాల సంఖ్యను ప్రస్తుతమున్న స్థాయి కంటే 50 శాతం పెంచాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన కీలక బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయడంలో భాగంగా, నియోజకవర్గాల సంఖ్యను పెంచడం ద్వారా అటు మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు ఇటు ప్రస్తుతమున్న స్థానాలకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.
ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోనున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ స్థానాల (Assembly Seats) సంఖ్య ఏకంగా 179కి పెరగనుంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ స్థానాల సంఖ్య 263కి చేరుకుంటుంది. లోక్‌సభ స్థానాల (Lok Sabha Seats) విషయంలోనూ ఇదే తరహా పెరుగుదల ఉండబోతోంది. ఏపీలో ప్రస్తుతం ఉన్న 25 ఎంపీ స్థానాలు 38కి, తెలంగాణలో ఉన్న 17 స్థానాలు 26కి పెరిగే అవకాశం ఉంది. ఈ మార్పుల వల్ల ఉభయ రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలకు కొత్త సవాళ్లు, అవకాశాలు ఎదురుకానున్నాయి.
మొత్తంగా దేశవ్యాప్తంగా చూస్తే లోక్‌సభలోని 543 స్థానాలు 816కి చేరుకుంటాయి. ఇందులో సుమారు 272 స్థానాలు మహిళలకు రిజర్వ్ చేయబడతాయి. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన (డెలిమిటేషన్) ప్రక్రియను వేగవంతం చేస్తూ, 2029 సార్వత్రిక ఎన్నికల నాటికే ఈ నూతన వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం గట్టి పట్టుదలతో ఉంది. ఈ చారిత్రాత్మక బిల్లు చట్టంగా మారాలంటే పార్లమెంట్‌లో మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం కానుంది, అందువల్ల ఈ సమావేశాలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
Read Also: హర్మూజ్‌కు నో ఆల్టర్నేట్
Follow Us On: Instagram

