కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) మున్సిపల్ కార్పొరేషన్‌కు మహర్దశ పట్టనుంది. స్మార్ట్ సిటీ పేరుతో ఇప్పటికే కరీంనగర్‌కు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసిన కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తాజాగా అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (Urban Challenge Fund) స్కీం కింద మరో మూడు ప్రాజెక్టులకు సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. వీటి మొత్తం విలువ రూ.895 కోట్లు. అందులో భాగంగా పట్టణ రవాణా మెరుగుదలకు మోడల్ రోడ్లు, జంక్షన్లు, స్కైవాక్‌లు, నాన్-మోటరైజ్డ్ ట్రాన్స్‌పోర్ట్ సదుపాయాలతో పాటు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌ల నిర్మాణం, అభివృద్ధి కోసం రూ.700 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించింది. అలాగే వర్షపు నీటి కాలువల నిర్మాణం, పునరావాసం, వరద నివారణ చర్యల కోసం రూ.130 కోట్లు కేటాయించనుంది. కరీంనగర్‌లో సమగ్ర ఘన వ్యర్థాల నిర్వహణ (Integrated Solid Waste Management) రూ.65 కోట్లతో ప్రతిపాదనలను సిద్ధం చేసింది. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry of Housing and Urban Affairs) కు చెందిన అపెక్స్ కమిటీ ఇటీవల ఢిల్లీలో సమావేశమై ఈ ప్రతిపాదనలపై చర్చించి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. అందులో భాగంగా కమిటీ ఆదేశాల మేరకు రేపు (శనివారం) కేంద్ర అధికారుల బృందం కరీంనగర్‌కు రానుంది. కరీంనగర్‌లో పర్యటించడంతో పాటు స్థానిక అధికారులతో సమావేశం కానున్నారు.
ఫలించిన బండి సంజయ్ కృషి
యూసీఎఫ్ స్కీంలో కరీంనగర్‌ను చేర్చడంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ చేసిన కృషి ఫలించింది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ మేయర్ పదవిని బీజేపీకి అప్పగిస్తే నిధులు వరద పారిస్తానంటూ బండి సంజయ్ హామీ ఇచ్చారు. కరీంనగర్ ప్రజలు మేయర్ పదవిని కాషాయ పార్టీకి అప్పగించడంతో ఇచ్చిన నిధులు తీసుకురావడంపైనే దృష్టి సారించారు. అందులో భాగంగా ఇటీవల 15వ ఆర్ధిక సంఘం నిధుల కింద కార్పొరేషన్ కు రూ.10 కోట్లు మంజూరయ్యాయి. దీంతో పాటు స్మార్ట్ సిటీలో భాగంగా కార్పొరేషన్‌కు రూ.70 కోట్లు వచ్చాయి. కరీంనగర్ రూపురేఖలు మార్చాలంటే ఈ నిధులు సరిపోవని భావించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ కట్టర్‌ను కలిశారు. తెలంగాణలో ఒకే ఒక్క మున్సిపల్ కార్పొరేషన్ ను బీజేపీ కైవసం చేసుకుందని పేర్కొంటూ అభివృద్ధిలో కరీంనగర్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు తగిన సహాయ సహకారాలు అందించాలని కోరారు. అందులో భాగంగా యూసీఎఫ్ స్కీంలో కరీంనగర్‌ను చేర్చాలని విజ్ఞప్తి చేశారు.
బండి సంజయ్ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం.. తగిన ప్రతిపాదనలను పంపాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. కేంద్రం లేఖను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర మున్సిపల్ శాఖ అధికారులు కరీంనగర్ కార్పొరేషన్ అధికారులతో పలుమార్లు సమావేశమై ప్రతిపాదనలను రూపొందించి కేంద్రానికి పంపారు. కేంద్రంలోని పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారుల అపెక్స్ కమిటీ రెండు రోజుల క్రితం ఈ ప్రతిపాదనలకు సూత్రప్రాయ ఆమోదం తెలపడంతోపాటు కరీంనగర్‌లో పర్యటించి ఆయా ప్రతిపాదనలపై రాష్ట్ర అధికారులతో చర్చించాలని కేంద్ర అధికారుల బృందాన్ని ఆదేశించింది. కేంద్ర ఆదేశాల మేరకు అధికారుల బృందం రేపు (శనివారం) కరీంనగర్ లో పర్యటించనుంది. ప్రతిపాదనల్లో పేర్కొన్న ప్రాజెక్టుల నిర్మాణంపై అధికారులతో చర్చించనుంది.

