కలం, వెబ్ డెస్క్: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Kohli) తన భవిష్యత్తు గురించి వస్తున్న రూమర్లపై అత్యంత ఘాటుగా స్పందించారు. 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆయన ఆడతారా లేదా అనే చర్చ సాగుతున్న వేళ, ఆర్సీబీ విడుదల చేసిన వీడియోలో కోహ్లీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తన కెరీర్ గురించి వస్తున్న విమర్శలపై కోహ్లీ నేరుగా స్పందిస్తూ.. తాను జట్టుకు ఎంతవరకు ఉపయోగపడతానో అక్కడి వాతావరణం గుర్తించినంత కాలం తాను కనిపిస్తానని చెప్పారు. అయితే, ప్రతిసారీ తన విలువేంటో నిరూపించుకోవాలని ఎవరైనా ఒత్తిడి తెస్తే మాత్రం, ఆ ప్రదేశం తనకు ఏమాత్రం సరిపోదని ఆయన కరాఖండిగా చెప్పారు. తాను ఆటకు ఇచ్చే విలువ, పడే శ్రమ విషయంలో ఎవరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇటీవల ఢిల్లీ తరఫున విజయ్ హజారే ట్రోఫీలో ఆడిన అనుభవాన్ని కోహ్లీ పంచుకున్నారు. “చాలా ఏళ్ల తర్వాత దేశవాళీ క్రికెట్ ఆడుతున్నప్పుడు ఎవరికో ఏదో నిరూపించాలని నేను అనుకోలేదు. కేవలం బ్యాటింగ్ మీద ఉన్న ఇష్టంతోనే ఆడాను. ఆ సమయంలో మళ్లీ పాత రోజుల్లోకి వెళ్లినట్లు, ఒక చిన్న పిల్లాడిలా అనిపించింది” అని విరాట్ ఎమోషనల్ అయ్యారు. వచ్చే ప్రపంచకప్ గురించి మాట్లాడుతూ.. దానికి ఇంకా సమయం ఉందని, కానీ తన ప్రిపరేషన్ మాత్రం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని చెప్పారు.
“నేను కేవలం సిరీస్ కోసమే కష్టపడను, నా లైఫ్ స్టైల్ మొత్తం ఫిట్‌నెస్‌తోనే ముడిపడి ఉంటుంది. భారత్ తరఫున ఆడటం గర్వకారణమే, కానీ ఆ గుర్తింపు రెండు వైపుల నుంచి ఉండాలి” అని తన మనసులో మాట బయటపెట్టారు. ఒక సాధారణ ఉద్యోగంలో ఒక వారం పొగిడి, మరో వారం సామర్థ్యాన్ని ప్రశ్నిస్తే ఎలా ఉంటుందో.. క్రికెట్‌లో కూడా పరిస్థితి అలాగే తయారైందని కోహ్లీ విచారం వ్యక్తం చేశారు. 311 వన్డేల్లో 54 సెంచరీలతో అప్రతిహతంగా సాగుతున్న కోహ్లీ కెరీర్‌పై ఇలాంటి చర్చలు రావడం దురదృష్టకరమని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

