కలం, వెబ్ డెస్క్ : దేశంలో గ్యాస్, చమురు ఉత్పత్తుల కృత్రిమ కొరత కలగకుండా కేంద్ర ప్రభుత్వం (Central Government) కీలక నిర్ణయం తీసుకున్నది. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల హార్ముజ్ జలసంధి ద్వారా వచ్చే సహజ వాయువు (LNG) రవాణాకు ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉందని గుర్తించిన పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ, సోమవారం రాత్రి ప్రత్యేక గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
అవసరమైన వస్తువుల చట్టం 1955 కింద ఉన్న అధికారాలను ఉపయోగించుకుంటూ, దేశీయంగా గ్యాస్ పంపిణీని క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం, అందుబాటులో ఉన్న గ్యాస్‌ను ప్రాధాన్యత క్రమంలో పంపిణీ చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గృహ అవసరాలకు వాడే పైప్డ్ గ్యాస్ (PNG), రవాణా రంగానికి అవసరమైన సీఎన్‌జీ (CNG), ఎల్పీజీ (LPG) తయారీకి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.
ఆ తర్వాతి స్థానాల్లో ఎరువుల కర్మాగారాలకు, టీ పరిశ్రమలకు, ఇతర పారిశ్రామిక అవసరాలకు గ్యాస్ సరఫరా చేయనున్నారు. సామాన్య ప్రజలకు నిత్యావసర ఇంధన సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండటమే లక్ష్యంగా ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని ప్రభుత్వం (Central Government) పేర్కొంది.
Read Also: గాంధీ విగ్రహం ఏర్పాటు.. సీఎం అపోహలు తొలగించాలి : తుషార్ గాంధీ
Follow Us On: Instagram

