కలం, ఖమ్మం బ్యూరో : తెల్లవారితే ఓట్లు వేయాల్సి ఉండగా ఉమ్మడి ఖమ్మం జిల్లా (Khammam) లోని ఎన్నికలు జరిగే మున్సిపాలిటీల్లో సాయంత్రం జనం ఆరుబయట అరుగుల మీదకు చేరుకున్నారు. బంధువులకు, పక్క వీధుల వారికి ఫోన్ లు చేసి మీ వీధికి వచ్చారా! మా వీధికి ఇంకా రాలేదు. మీకు ఎంత ఇస్తున్నారు. రెండు పార్టీల వాళ్ళు వచ్చారా. మావాడు హైదరాబాద్ నుంచి వస్తున్నాడు.వాడికి కూడా ఇస్తారా అనే సంభాషణలు సర్వ సాధారణంగా వినిపిస్తున్నట్లు జిల్లా (Khammam) ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు.
మరో పక్క కొంత మంది అభ్యర్ధులు దేవుని ఫొటోల మీద ప్రమాణాలు చేయించుకొని, నమ్మకం కుదిరిన తర్వాతే డబ్బులు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఒకే కుటుంబానికి చెందిన వారైనా ఓటరు లిస్ట్ లో పేరు ఉన్న వ్యక్తికే డైరెక్ట్ గా తాయిలాలు ముట్ట చెబుతున్నారు. మా వాడు నైట్ బయలు దేరాడు అన్నా సరే వచ్చాక కలవమనండి అని చెప్తున్నట్లు సమాచారం.
డబ్బుల పంపిణీ విషయంలో అభ్యర్ధులు చాలా చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. డివిజన్ల వారీగా ఓటర్లను గుర్తించి, వీరిలో తమ పార్టీకి ఎవరు ఓటు వేస్తారు. ఇచ్చే డబ్బులకు న్యాయం ఎవరు చేస్తారు. డివిజన్ మొత్తం మీద ఏ పార్టీ వాళ్ళు ఎంత మంది ఉన్నారు. మొదలైన అంశాలను పరిగణలోకి తీసుకొని, నమ్మకస్తులకు ఫోన్ పే వంటి మాధ్యమాల ద్వారా, కొంచెం అనుమానం ఉంటే ఇంటికి వెళ్ళి మాట్లాడి డబ్బులు పంచుతున్నట్లు తెలుస్తోంది. డబ్బులు ఓటర్లకు అందాయ లేదా అని ఒక టీమ్ ఫోన్ చేసి మరి క్రాస్ చెక్ చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది.
ఒక పక్క అభ్యర్ధులు డబ్బులు పంచే విషయంలో, ఓట్లు పడతాయో లేదో అనే టెన్షన్ లో ఉంటే మరో పక్క ఓటర్లు డబ్బులు అందుతాయో లేదో అనే మీమాంస లో ఉన్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మొత్తం మీద పోలింగ్ కు కొన్ని గంటల వ్యవధి మాత్రమే మిగిలి ఉండటంతో అందరిలో ఒక రకమైన ఉత్కంఠ నెలకొన్నమాట వాస్తవం.
Read Also: రూ.కోట్లు ఇవ్వాలని ధురంధర్ నటుడికి బెదిరింపులు
Follow Us On : WhatsApp


