కలం, వెబ్ డెస్క్: ఇటీవల మల్కాజిగిరి, సికింద్రాబాద్‌లో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender)కు వ్యతిరేకంగా వెలసిన ఫ్లెక్సీల వివాదంలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ ఫ్లెక్సీ వ్యవహారం వెనుక మరో బీజేపీ నాయకుడు, బండి సంజయ్ (Bandi Sanjay) అనుచరుడు రామకృష్ణ ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈటల రాజేందర్ పార్టీకి ఏం చేశాడంటూ, ఆయన వల్ల ఎలాంటి ఉపయోగం లేదంటూ కొద్ది రోజుల క్రితం పలు చోట్ల ఫ్లెక్సీలు కలకలం రేపాయి. బీజేపీలో ఐక్యత చూసి ఓర్వలేకనే వీటిని ఇతర పార్టీల వాళ్లు ఏర్పాటు చేయించి ఉంటారని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు ఆరోపించారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపిస్తామని చెప్పారు. కూకట్‌పల్లి బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ దీనిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.
ఇక ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి బండి సంజయ్ అనుచరుడు, బీజేపీ నేత, సికింద్రాబాద్ కంటోన్మెంట్ మాజీ వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణను నిందితుడిగా తేల్చారు. ఈ కేసులో A1గా జన్యావుల రామకృష్ణ, A2గా రామకృష్ణ పీఏ గాజుల రాకేష్ , A3గా సయ్యద్ కుద్రుత్ అహ్మద్, A4గా సయ్యద్ మెహ్రాజ్, A5గా షేక్ కలీం, A6గా నజీర్ ఉద్దీన్‌లను చేర్చారు.

