కలం, వరంగల్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “తెలంగాణ దర్శన్” అధ్యయన పర్యటనలో భాగంగా 2025 బ్యాచ్‌కు చెందిన ట్రైనీ ఐఏఎస్ అధికారులు రెండ్రోజులపాటు వరంగల్ (Warangal) నగరంలో పర్యటించారు. జిల్లాలోని పలు చారిత్రక, పర్యాటక, సామాజిక అభివృద్ధి కేంద్రాలను సందర్శించి స్థానిక పరిపాలన, ప్రజాపాలన, అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరుపై అవగాహన పొందారు.
ప్రపంచ వారసత్వ కట్టడం రామప్ప దేవాలయం, వరంగల్ కోట, వేయి స్తంభాల దేవాలయం, భద్రకాళి దేవాలయం తదితర కాకతీయుల వైభవాన్ని ప్రతిబింబించే చారిత్రక ప్రదేశాలను సందర్శించారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఆదర్శ సహకార సంస్థగా గుర్తింపు పొందిన ముల్కనూర్ సహకార సంఘాన్ని సందర్శించి, గ్రామీణాభివృద్ధి, సహకార వ్యవస్థల నిర్వహణపై అధ్యయనం చేశారు.
ఈ సందర్భంగా ట్రైనీ అధికారులు హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ లను కలిసి జిల్లా పరిపాలన, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి ప్రణాళికలు, శాంతిభద్రతల నిర్వహణ తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు.
ఈ పర్యటనకు లైజన్ అధికారిగా వ్యవహరించిన డాక్టర్ కుసుమ సూర్యకిరణ్, అసిస్టెంట్ టూరిజం ప్రమోషన్ ఆఫీసర్, కాకతీయుల చరిత్ర, వారి పరిపాలనా దక్షత, సాగునీటి వనరుల అభివృద్ధి, దేవాలయ నిర్మాణ శిల్పకళ, సాంస్కృతిక వారసత్వం, ప్రజా సంక్షేమ దృక్పథం వంటి అంశాలను ట్రైనీ అధికారులకు సమగ్రంగా వివరించారు.
కాకతీయులు నిర్మించిన చెరువులు, సాగునీటి వ్యవస్థలు, అద్భుతమైన శిల్పకళా సంపద, దేవాలయ నిర్మాణాలు నేటికీ ప్రజలకు ఉపయోగపడుతున్నాయని, వారి పరిపాలనా విధానం సమాజాభివృద్ధికి ఆదర్శంగా నిలిచిందని ట్రైనీ అధికారులు అభిప్రాయపడ్డారు. పర్యటన ముగింపు సందర్భంగా హరిత హోటల్‌లో బస చేసిన ట్రైనీ అధికారులకు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ తరఫున రామప్ప దేవాలయం, భద్రకాళి దేవాలయాల ప్రతిరూపాలతో రూపొందించిన ప్రత్యేక జ్ఞాపికలను అందజేశారు.
ఈ పర్యటన విజయవంతం కావడంలో స్థానిక ఆర్డీవో వెంకటేష్, తహసీల్దార్ రవీందర్ రెడ్డి, హనుమకొండ ఆర్‌ఐ దశరథరాం రెడ్డి, హరిత హోటల్ మేనేజర్ అశోక్ రెడ్డి, హోటల్ సిబ్బంది నరేశ్, కిరణ్, సాయి, రచన, భవాని, సంధ్య, రాజు, రెవెన్యూ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు, పోలీస్ శాఖ అధికారులు, ఇతర సిబ్బంది విశేష కృషి చేశారు.

